Anantapur: ఒక్కడే.. ఆ నలుగురై! 

6 May, 2021 08:16 IST|Sakshi

అనాథల సేవలో  తరిస్తున్న రమణారెడ్డి

‘సంజీవిని’ ట్రస్ట్‌తో సాటివారికి సాయం

కరోనా బాధితుల వద్దకే వెళ్లి మందుల పంపిణీ

అనాథ మృతులకు అంతిమ సంస్కారాలు

అన్నార్థులకు దాతలసాయంతో అన్నదానం

కరోనా.. మనషులను కర్కశంగా మార్చేసింది. సాటి మనిషి ప్రాణంపోయే స్థితిలో  కొట్టుమిట్టాడుతున్నా.. సాయం చేసే ధైర్యం ఎవరికీ ఉండటం లేదు. ఇక కరోనాతో మృతి చెందిన వారి అంతిమ సంస్కారాలకూ కుటుంబీకులే ముందుకురాని దుస్థితి. ఇలాంటి వారి కోసమే తానున్నానంటూ రమణారెడ్డి ముందుకొచ్చారు. వైరస్‌ సోకి మృత్యువాత పడిన వారికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. సంజీవని సంస్థ ద్వారా ఆపదలో ఉన్న వారికి తనవంతు సాయం చేస్తున్నాడు.  

ఇటీవల పాతూరులో 63 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృత్యువాత పడ్డాడు. ఆయన భార్య కుటుంబీకులు, బంధువులందరికీ సమాచారమిచ్చినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించింది. పోలీసులు వెంటనే ‘సంజీవిని హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ను సంప్రదించగా.. రమణారెడ్డి అతని మిత్ర బృందం కదిలివచ్చారు. శాస్త్రోక్తంగా ఆ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో మృత్యువాత పడి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాని ఎందరినో సంజీవిని సంస్థ సగౌరవంగా సాగనంపుతోంది. 

సాక్షి, అనంతపురం: అనంతపురానికి చెందిన రమణారెడ్డికి మొదటి నుంచీ సేవాభావం ఎక్కువ. వృద్ధులు, అనాథలపై అవ్యాజమైన ప్రేమ చూపుతుంటాడు. 2005లో రక్తదానంపై విస్తృత అవగాహన కల్పించడానికి ‘సంజీవిని హెల్పింగ్‌  హ్యాండ్స్‌’ పేరిట సేవా ప్రస్థానం ప్రారంభమైంది. తలసీమియా వ్యాధి బాధిత చిన్నారులకు స్వచ్ఛంద రక్త దాతల సహకారంతో అతను అందించిన సేవలు ఎందరికో స్ఫూర్తి. ఆర్థిక స్థోమత లేక నిస్సహాయంగా ఉండేపోయే వారికి నిత్యం ఖరీదైన మందులను అందించడం, ఆకలి దప్పులతో అలమటించే వారి కోసం నిత్యాన్నదానం చేయడం, వేసవి వచ్చిందంటే వృద్ధులకు పాదరక్షలందివ్వడం వంటివి ఆయన నిత్యం చేస్తున్న సేవా కార్యక్రమాలలో కొన్ని మాత్రమే. 

అన్నార్థుల కడుపు నింపుతూ.. 
నగరంలో రోజూ ఎక్కడోచోట కదల్లేని స్థితిలో వృద్ధులు కనిపిస్తుంటారు. వీరంతా ఆ దారి వెంట వెళ్లే వారి దయపై బతుకుతుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో జనం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడం లేదు. ఒకవేళ బయటకు వచ్చిన ప్రక్కన ఉన్న మనిషిని తాకే ధైర్యం ఎవరికీ ఉండటం లేదు. దీంతో అనాథల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి వారెందరికో రమణారెడ్డి ఆకలిదప్పులు తీరుస్తున్నారు. దాతల సాయంతో భోజనం సమకూర్చుకుని నగరమంతా తిరుగుతూ అనాథల కడుపునింపుతున్నాడు.  

చదవండి: ‘ఆ నలుగురూ’.. స్నేహితులే

అన్నీ తానై అంత్యక్రియలు 
కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండగా.. ఎందరో ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. కొందరు కనీసం మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటున్నారు. ఇలాంటి వారి గురించి తెలిసిన వెంటనే.. రమణారెడ్డి మందులు తీసుకెళ్లి బాధితులకు అందజేస్తున్నారు. ఇక కరోనాతో కొందరు మృత్యువాత పడి బంధువులెవరూ ముందుకురాక అంతిమసంస్కారాలకు నోచుకోని వారిని రమణారెడ్డి అన్నీ తానై సాగనంపుతున్నాడు. వారివారి మతానుసారం సంజీవని సంస్థ ద్వారా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 20మందికి పైగా అనాథలకు అంతిమ వీడ్కోలు పలికారు. ఏ జన్మలోనో ఉండే రుణాన్ని తీర్చుకుంటున్నారు. అతనితో పాటు రామాంజనేయులు, జగదీశ్వరరెడ్డి, శ్రవణ్, సోహెల్, ఆది తదితరులతో కలిసి కరోనా సమయంలో సంజీవిని హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ద్వారా చేస్తున్న సేవలు ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్నాయి. 

నా బాధ్యత అనుకున్నా.. 
వైరస్‌ సోకిన వ్యక్తి మృతి చెందితే అంతిమ సంస్కారాలకు చాలా మంది ముందుకు రాని పరిస్థితి. సమాచారం తెలిసిన వెంటనే వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. ఇందుకు కొంత ఖర్చు అవుతున్నప్పటికీ.. నా స్నేహితులు, తెలిసిన వారు సాయం చేస్తున్నారు. అలాగే చాలా మంది ఇళ్లలో ఆహార పదార్థాలను వృథాగా  పారవేస్తుంటారు. 94404 76651 నంబర్‌కు సమాచారం ఇస్తే ఎక్కడికైనా వచ్చి ఆహారాన్ని తీసుకువెళ్లి అవసరం ఉన్నవారికి అందిస్తాం.  
– రమణారెడ్డి, సంజీవిని హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థ నిర్వాహకుడు   

చదవండి: అబ్బాయి అబద్ధం చెప్పాడు.. ‘ఈ పెళ్లి నాకొద్దు’

మరిన్ని వార్తలు