సీఎం జగన్‌ ఇంట నేడు సంక్రాంతి సంబరాలు

14 Jan, 2024 04:10 IST|Sakshi

గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకల నిర్వహణ

పూర్తిగా పల్లె వాతావరణం.. అభివృద్ధి కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు

ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: ముత్యాల ముగ్గులు, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్య­మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట నేడు సంక్రాంతి శోభ వెల్లివిరియనుంది. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు.

నవరత్నాలతో ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రాలు, మెడికల్‌ కాలేజీ, నాడు–నేడు స్కూల్, పాల కేంద్రం నమూనాలు, ఎడ్లబండ్లు, గ్రామీణ ఇళ్లతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లుచేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన కళాకారులు వీటిని అద్భుతంగా తీర్చిదిద్దారు. వందేళ్ల క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ఇక్కడ ప్రత్యేకంగా సెట్టింగ్‌ ఏర్పాటుచేశారు. 

భోగి మంటలతో సంబరాలకు శ్రీకారం..
తొలుత సీఎం వైఎస్‌ జగన్, భారతమ్మ దంప­తులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మం­టలు వేయటంతో ఆదివారం పండుగ సంబరాలు ప్రారంభమ­వుతాయి. గంగిరెద్దులకు సారెను సమర్పిస్తారు. 
► తిరుమల రహదారి మార్గంలో ఉండే శిలా­తోరణం లాంటి సెట్టింగ్‌ గుండా ముఖ్యమంత్రి దంపతులు గోశాల ప్రాంగణంలోకి అడుగుపెడతారు. 
► గోపూజ కార్యక్రమంలో వారిరువురూ పాల్గొంటారు. ఆ తర్వాత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి సంక్రాంతి సంబరాల ప్రాంగణంలోకి అడుగుపెడతారు. 
► ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విప్‌ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు