స్నేహం+సంప్రదాయం: వింత ఆనవాయితీ.. అక్కడ సంక్రాంతికి అటుకులిచ్చి పంపుతారు!

13 Jan, 2022 12:11 IST|Sakshi

కొత్త పంట చేతికి రావడంతో అటుకుల మిల్లుల వద్ద రద్దీ

విశాఖపట్నం: సంక్రాంతి పండక్కి వచ్చిన బంధువులు, స్నేహితులను ఉత్త చేతులతో పంపకుండా.. అటుకులిచ్చి గౌరవంగా పంపడం పల్లెల్లో అనాదిగా వస్తున్న ఆచారం. అటుకుల పేరు చెప్పగానే పురాణాల్లో స్నేహబంధం గుర్తుకు వస్తుంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి మీద ప్రేమతో పేద స్నేహితుడైన కుచేలుడు అటుకులు బహుమానంగా ఇవ్వగా.. శ్రీకృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. రైతులు కొత్తగా పండిన ధాన్యాన్ని తొలి పంటగా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా చూపడం ఆనవాయితీ. ఆ ధాన్యాన్ని అటుకులుగా ఆడిస్తారు. రైతు కుటుంబాల్లో అటుకులు ప్రధాన పాత్ర వహిస్తాయి.  

అటుకులతో బెల్లం ముక్కలు, పాలు చక్కెర, ఉప్పు కారం, పులిహోర ఇలా అనేక రకాలుగా చిరు వంటకాలు తయారు చేస్తారు. ఈ ఏడాది ఆశించినమేర వరి సాగై.. రైతుల ఇళ్లకు ధాన్యం రావడంతో అటుకుల మిల్లుల నిర్వాహకులకు చేతినిండా పని దొరికింది. పెట్టుబడులకు తగ్గట్టుగా 3 నెలల పాటు పని చేసుకునే అవకాశం కలిగిందని మిల్లు యజమానులు చెబుతున్నారు. గతంలో పుట్టగొడుగుల్లా వెలసిన అటుకుల మిల్లులు.. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే దర్శనమిస్తున్నాయి. నక్కపల్లి, గొడిచర్ల, అడ్డురోడ్డు, పాయకరావుపేట, తుని తదితర ప్రాంతాల్లో సుమారు 15 వరకు అటుకుల మిల్లులు ఉన్నాయి. డిసెంబర్‌ మొదలు మార్చి వరకు ఈ మిల్లుల వద్ద సందడి ఉంటుంది.  

వేపిన ధాన్యాన్ని మిల్లులో వేసి అటుకులుగా తయారు చేస్తున్న దృశ్యం 

అటుకుల తయారీ ఇలా.. 
డీజిల్‌తో ఈ మిల్లులు నడుస్తాయి. ముందుగా ధాన్యాన్ని పొయ్యి మీద వేపుతారు. పొయ్యిని కూడా మట్టితో ఏర్పాటు చేస్తారు. దీని మీద 40 కిలోల బరువు ఉండే బీడు కలాయిలు ఏర్పాటు చేసి ఇసుకలో ధాన్యాన్ని ఒక పర్యాయం వేపిన తర్వాత.. మిల్లు ఆడిస్తే అటుకులు తయారవుతాయి. ధాన్యాన్ని వేపడం కోసం ప్రత్యేకంగా జీడి పిక్కల పరిశ్రమల నుంచి మడ్డి తెస్తారు. జీడి తొక్క నుంచి నూనె తీయగా వచ్చే నల్లటి మడ్డి పదార్థాన్ని వీరు పొయ్యిల్లో వేసి మండిస్తారు. కేడీపేట నుంచి బస్తా రూ.170లకు కొనుగోలు చేస్తారు.

కలాయిలో ధాన్యాన్ని వేపుతున్న కార్మికుడు 

బస్తా మడ్డి 200 కిలోల ధాన్యాన్ని వేపేందుకు సరిపోతుంది. మిల్లును డీజిల్‌ ఇంజిన్‌ సహాయంతో నడుపుతారు. ధాన్యం వేపే వారికి కుంచానికి(4 కిలోలు)రూ.8, మిల్లు ఆడే వ్యక్తికి కుంచానికి రూ.5 చెల్లిస్తారు. 20 లీటర్ల డీజిల్‌తో 300 కుంచాల(1200 కిలోల) ధాన్యం అటుకులుగా ఆడొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా ధాన్యాన్ని అటుకులుగా ఆడించినందుకు కుంచానికి రూ.40 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్‌ కావడంతో అటుకుల మిల్లుల వద్ద సందడి కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు