ప్రాజెక్టులతో మహా సంక్రాంతి

29 Dec, 2020 12:18 IST|Sakshi

రూ.374.17 కోట్లతో 4 ప్రాజెక్టులను పూర్తి చేసిన జీవీఎంసీ

ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవానికి సన్నాహాలు

జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.374.17 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకే రోజున ప్రారంభం కానున్నాయి. కార్య నిర్వాహక రాజధానిగా ప్రగతిపథంలో దూసుకుపోయేందుకు సన్నద్ధమవుతున్న విశాఖ నగరానికి మరింత శోభ చేకూరేలా జీవీఎంసీ చేపట్టిన స్మార్ట్‌ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలకు అనుగుణంగా చేపట్టిన ప్రాజెక్టుల విశేషాలివీ..  

సాక్షి, విశాఖపట్నం: విశ్వనగరిని అభివృద్ధి మణిమకుటంగా మార్చేందుకు సంకల్పించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విశాఖ నగర ప్రజల సంక్షేమం కోసం జీవీఎంసీ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. సంక్రాంతి పండగ సందర్భంగా వీటిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీవీఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. 

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి  
కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకు వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు జిందాల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టు ఫ్యాబ్రికేషన్స్‌(జెఐటీఎఫ్‌) సంస్థతో జీవీఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. కాపులుప్పాడ డంపింగ్‌ యార్డు స్థలంలోని 17.50 ఎకరాల యార్డులో ప్లాంట్‌ నిర్మాణ పనులను జిందాల్‌ సంస్థ రెండేళ్ల క్రితం ప్రారంభించింది. రూ.320 కోట్లతో జిందాల్‌ అర్బన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖ లిమిటెడ్‌ పేరుతో ప్లాంట్‌ సిద్ధమవుతోంది. యార్డులో డంప్‌ చేసిన చెత్తనంతటినీ ప్లాంట్‌లోకి పంపించి.. రోజుకు 18 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. వచ్చిన చెత్తను బాయిలర్లలో వేసి మండించడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి కానుంది. ఈ చెత్తను వేడి చేసేందుకు అవసరమైన నీటిని మారికవలస సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి పైప్‌ లైన్ల ద్వారా తీసుకురానున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి జరిగిన తర్వాత మిగిలిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగించనున్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. జనవరి మొదటి వారానికి ప్లాంట్‌ పూర్తి కానుంది. 

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు రూ.320 కోట్లు 
మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ రూ.9.70 కోట్లు 
వారసత్వ కట్టడాల పరిరక్షణ ప్రాజెక్టు రూ.10.97 కోట్లు 
వుడా పార్కు అభివృద్ధి రూ.33.50 కోట్లు  

స్మార్ట్‌గా వుడా పార్కు  
బీచ్‌ రోడ్డులో 47 ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఎకరాలను ఖాళీగా విడిచిపెట్టి, మిగిలిన 40 ఎకరాల్లో ఉన్న వుడా పార్కును సమగ్ర అభివృద్ధి చేసి స్మార్ట్‌ పార్క్‌గా రూపొందిస్తున్నారు. రూ.33.50 కోట్లతో పార్కు ఆధునికీకకరణ పనులు  జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న లేక్‌ బోటింగ్‌ ఆధునికీకరణలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎథిలీన్‌ ప్రాపలీన్‌ డయిన్‌ ప్రోమేన్‌ మెనిమేర్‌(ఈపీడీపీఎం) ఫ్లోరింగ్‌ నిర్మించారు. పిల్లలు ఆటలాడుకునేలా, పెద్దలు కూర్చొని కబుర్లు చెప్పుకునేలా మల్టీ పర్పస్‌ లాన్, స్పోర్ట్స్‌ ఏరియాలో స్కేటింగ్‌ రింగ్‌తో పాటు టెన్నిస్‌కోర్టులు, బాస్కెట్‌బాల్, షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌ కోర్టులు పార్కులో సిద్ధమవుతున్నాయి. యాంపీ థియేటర్‌ కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఎంట్రన్స్‌ ప్లాజాలో పగోడాలు ఏర్పాటు చేయడంతో పాటు ముఖద్వారం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఉల్లాసంతో పాటు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేలా ఔషధ మొక్కలు, అరుదైన మొక్కలు ఏర్పాటు చేసి వాటి శాస్త్రీయ నామాలు సూచించే బోర్డులు పెడుతున్నారు. మొత్తమ్మీద వుడా పార్కు సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత కొత్త రూపు సంతరించుకుంది. 

పార్కింగ్‌ కష్టాలకు చెక్‌ 
జగదాంబ జంక్షన్‌లో పార్కింగ్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు జీవీఎంసీ రూ.9.70 కోట్లతో రాష్ట్రంలో తొలి మల్టీ లెవెల్‌ కార్‌పార్కింగ్, దేశంలో తొలి మెకనైజ్డ్‌ ఆటోమేటిక్‌ పార్కింగ్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసింది. 367 చ.మీ. విస్తీర్ణంలో మొత్తం 100 కార్లు పార్క్‌ చేసేలా దీన్ని నిర్మించారు. ఇప్పటికే కార్ల పార్కింగ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మొత్తం 6 లెవెల్స్‌లో స్ట్రక్చర్‌ నిర్మించారు. దివ్యాంగులు కూడా పార్క్‌ చేసుకునేలా సౌకర్యం కల్పించారు. పూర్తి సెన్సార్ల సహకారంతో పార్కింగ్‌ చేసేలా వ్యవస్థ రూపుదిద్దుకుంది. 

వారసత్వ సంపద పరిరక్షించేలా... 
నగరంలోని వారసత్వ సంపదను పరిరక్షించేందుకు జీవీఎంసీ నడుం బిగించింది. చారిత్రక గురుతులుగా మిగిలి, శిథిలావస్థలో ఉన్న టౌన్‌హాల్, ఓల్డ్‌ మున్సిపల్‌ హాల్‌ సంరక్షణ బాధ్యతలను స్వీకరించింది. రూ.4.13 కోట్లతో టౌన్‌హాల్, రూ.6.84 కోట్లతో పాత మున్సిపల్‌ భవనం సంరక్షణ పనులు చేపట్టింది. దాదాపు 98 శాతం పనులు పూర్తయ్యాయి. పాత కట్టడాలు రూపురేఖలు కోల్పోకుండా, రెండు భవనాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. వీటితో పాటు ఎంవీపీ కాలనీలోని స్పోర్ట్స్‌ ఎరీనాను రూ.19.89 కోట్లతో నిర్మిస్తున్నారు. రూ.20 కోట్లతో మూడు స్మార్ట్‌ రహదారులు పూర్తి చేస్తున్నారు. జనవరి మొదటి వారానికల్లా ఈ రెండు ప్రాజెక్టుల పనులు పూర్తయితే.. వీటిని కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తే నగర వాసులకు మరింత ఆహ్లాదం, అంతకు మించి ఆరోగ్యం అందుతుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు