Sankranti Rush: ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌

12 Jan, 2023 18:43 IST|Sakshi

ఆన్‌లైన్‌లో రెండు రకాల టికెట్‌ రేట్లు

మాన్యువల్‌ అయితే.. మరింత దోపిడీ

మామూళ్ల మత్తులో ఆర్టీఓ కార్యాలయ అధికారులు

సమావేశాలతో సరిపెడుతున్న వైనం

నిబంధనలు విస్మరించి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిలుపుదల

పట్నంబజారు(గుంటూరుఈస్ట్‌): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గుంటూరు జిల్లాలోని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అడ్డుఅదుపూ లేకుండా దోచుకుంటున్నాయి. నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. గుంటూరు జిల్లాలో సుమారు 150 వరకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతోపాటు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తరలివస్తున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ధరలకు అనుగుణంగానే టికెట్‌ ధరలు ఉండాలనే రవాణాశాఖ అధికారుల సూచనలను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఖాతరు చేయని పరిస్థితులు కనపడుతున్నాయి. 


బుక్‌ చేస్తే.. మరో ధర 

ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో టికెట్లు బుక్‌ చేసుకునేందుకు అనేక రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్‌లు ఓపెన్‌ చేయగానే ఒక ధర.. అన్ని ఆప్షన్స్‌ పూర్తి చేసిన తర్వాత బుక్‌ చేసుకునే సమయానికి మరో ధర వస్తోంది. మంగళగిరికి చెందిన ఓ విద్యార్థిని పండుగ నిమిత్తం బెంగళూరు నుంచి సొంత ఊరికి వచ్చేందుకు టికెట్‌ బుక్‌ చేసుకుంది. ముందు టికెట్‌ ధర రూ 1700 చూపించిన క్రమంలో బుక్‌ చేసే సరికి రూ.2400 అయింది. ఇంచుమించుగా యాప్‌ల్లో ఇదే పరిస్థితి కనపడుతోందని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లోనే ఇదే విధంగా వ్యవహరిస్తే.. సాధారణంగా ఒక కార్యాలయానికి వెళ్లి టికెట్‌ బుక్‌ చేసుకునే వారి పరిస్థితి ఇక చెప్పాల్సిన పనిలేదు. ఆర్టీఓ అధికారులు సూచించిన ధరల కంటే అధికంగా దోచుకుంటున్నారు.  


సమావేశాలకే పరిమితం 

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు చేపట్టాల్సిన ఆర్టీఓ అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధిక ధరలతో ప్రయాణికులను దోపిడీ చేస్తున్నా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీలు చేస్తున్నామని పేరుకే తప్ప.. ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మోటార్‌ వెహికల్‌ నిబంధనల ప్రకారం ఆర్టీసీ బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల లోపు ప్రైవేట్‌ బస్సులు ఉండకూడదని ఆదేశాలు ఉన్నప్పటీకీ ఆర్టీఓ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే వాదనలు లేకపోలేదు.

మంగళవారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులతో సమావేశం నిర్వహించి అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని డీటీసీ హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సాయంత్రం సమయంలో ప్రైవేట్‌ బస్సుల వలన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పటీకీ కనీసం ట్రాఫిక్‌ పోలీసులు స్పందించకపోవటం గమనార్హం.  


తనిఖీలు నిర్వహిస్తున్నాం 

జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. మంగళగిరి టోల్‌ ప్లాజా, పేరేచర్ల మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం, వాటిని మరింత ముమ్మరం చేస్తాం. స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి అధిక ధరలకు టికెట్‌ విక్రయాలు లేకుండా చేస్తాం. ప్రయాణికులు సైతం అధిక ధరలు డిమాండ్‌ చేస్తే మా దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాం.  
– షేక్‌ కరీం, డీటీసీ 

మరిన్ని వార్తలు