-

సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు

20 Dec, 2022 03:41 IST|Sakshi

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక కాల్‌ సెంటర్‌

6,400 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం

సాక్షి, అమరావతి: సంక్రాంతి ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా సాధారణ చార్జీలతోనే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. గత 25ఏళ్లుగా దసరా, సంక్రాంతి సీజన్‌లో ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు (అంటే 150శాతం చార్జీలు) వసూలు చేస్తూ వచ్చింది. కానీ తొలిసారిగా ఈ ఏడాది దసరా సీజన్‌లో ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నడిపింది.

అదే రీతిలో రానున్న సంకాంత్రి సీజన్‌లో కూడా ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నడపనుంది. సంక్రాంతికి సొంతూరు వెళ్లి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం 6,400 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంక్రాంతి ప్రత్యేక బస్సుల వివరాలను వెల్లడించారు.

సంక్రాంతి ప్రత్యేక బస్సు సర్వీసులకు సంబంధించిన వివరాలు
సంక్రాంతికి ముందుగా జనవరి 6 నుంచి 14 వరకు 3,120 ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వ­హిస్తారు. సంక్రాంతి అనంతరం జన­వరి 15 నుంచి 18 వరకు 3,280 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతారు. మొత్తం 6,400 ప్రత్యేక బస్సు­ల్లో హైదరాబాద్‌తో­పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే 3,600 బస్సులను ఏపీకి నిర్వహించనుండటం విశేషం. బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 బస్సు సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడుపుతారు.

► రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విజయవాడకు 800 బస్సులు, విశాఖపట్నానికి 450 బస్సులు, రాజమహేంద్రవరానికి 200 బస్సులు, ఇతర ప్రాంతాలకు మరో 770 ప్రత్యేక బస్సులు నడుపుతారు.
► అన్ని బస్సులను జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తారు. 
► ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. ఆర్టీసీ పోర్టల్‌ (www.apsrtconline.in) ద్వారా నేరుగా రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఏటీబీ ఏజెంట్లు, ఏపీఎస్‌ఆర్టీసీ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ సేవలను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, హైదరాబాద్‌లోని వివిధ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని ఏర్పాటుచేస్తారు.
► ప్రయాణికులకు సమాచారం కోసం 24/7 కాల్‌సెంటర్‌( 0866–2570005)ను ఆర్టీసీ నిర్వహిస్తుంది. 
► ఆర్టీసీ నూతనంగా ప్రవేశపెట్టిన నాన్‌ ఏసీ స్లీపర్‌ సర్వీసు స్టార్‌ లైనర్‌ బస్సులను హైదరాబాద్, ఒంగోలు, కడప, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు నుంచి నడుపుతుంది.
► ఆర్టీసీ అన్ని దూర ప్రాంత సర్వీసులకు వచ్చి వెళ్లేందుకు ముందుగా రిజర్వేషన్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణచార్జీలో 10శాతం రాయితీ కల్పించింది.    

మరిన్ని వార్తలు