రఘురామకృష్ణరాజు అప్పీల్‌పై ఆక్షేపణ

24 Jun, 2021 04:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైకోర్టుకు నివేదించిన సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌

సాక్షి, అమరావతి: లైమ్‌స్టోన్‌ మైనింగ్‌ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ 2019లో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన అప్పీల్‌పై సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగిల్‌ జడ్జి ముందున్న కేసులో రఘురామకృష్ణరాజు కక్షిదారు కాదని, అలాంటప్పుడు సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీల్‌ దాఖలు చేసే అర్హత ఆయనకు లేదని సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ అప్పీల్‌ దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తమకు అభ్యంతరాలున్నాయని తెలిపారు.

అప్పీల్‌కు అనుమతినివ్వాలా? లేదా? అన్న అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని వివరించారు. 2019లో కోర్టు తీర్పునిస్తే ఇప్పుడు అప్పీల్‌ దాఖలు చేయడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు, అప్పీల్‌లో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌కు నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు లీవ్‌ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు  సీజే జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. 

మరిన్ని వార్తలు