Singer Parvathi: ఒక్క పాటతో కదిలిన యంత్రాంగం.. వెంటనే ఊరికి బస్సు తీసుకొచ్చింది

21 Feb, 2022 08:58 IST|Sakshi

సంగీతానికి రాళ్లనైనా కరిగించే శక్తి ఉంటుంది అంటారు. కానీ తన పాటతో ఏకంగా ఊరికి ఆర్టీసీ బస్సు తీసుకొచ్చేలా చేసింది ఓ అమ్మాయి. ఏళ్ల తరబడి ఊరికి బస్సు కావాలని అధికారులకు మొర పెట్టుకున్న జరగని పనిని ఒక్కపాటతో కదిలించింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతీ తన గొంతులో జీ- సరిగమపలో పాడే అవకాశం దక్కించుకొని ప్రతిభకు అందంతో పని లేదని నిరూపించింది. సరిగమప కొత్త సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన సింగర్ పార్వతి తన పాటతో అందరి మనసులు గెలుచుకుంది. ఊరికి బస్సు సౌకర్యాన్ని రప్పించింది. పార్వతి గురించి పూర్తి వివరాలు..

కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. తమకున్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమార్తె దాసరి పార్వతి బాల్యం నుంచే పాటలు పాడడంపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో పాటలు పాడే విధానాన్ని గమనించి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు.  సాధన చేస్తే భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగవచ్చని చెప్పడంతో తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదు. ఇంటర్‌ పూర్త య్యాక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేర్పించారు.
చదవండి: 62 ఏళ్ల​ బామ్మ పర్వత శ్రేణి ట్రెక్కింగ్‌! ఫిదా అవుతున్న నెటిజన్లు

అక్కడ ప్రిన్సిపాల్‌ సుధాకర్, గురువు వల్లూరి సురేష్‌బాబు వద్ద  శిక్షణ తీసు కుంటూ పార్వతి టీటీడీ చానల్‌ ‘అదిగో అల్లదిగో’ కార్యక్రమానికి ఎంపికయ్యారు. పలు పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జీ తెలుగు చానల్‌లో పార్వతికి పాట పాడే అవకాశం వచ్చింది.  ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ అనే పాట పాడడంతో కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రశంసలు కురిపించారు. పార్వతిని ఏమి కావాలో కోరుకోమని అడగగా.. తాను పడ్డ కష్టాలు తమ గ్రామస్తులు పడకూడదని, తన గ్రామానికి బస్సు తిప్పాలని కోరారు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా లేచి నిలబడి పార్వతికి ధన్యవాదాలు తెలియజేశారు.  

పల్లెకు పరుగులు తీసిన పల్లె వెలుగు 
పార్వతి పాడిన పాట సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. లక్షలాది వీక్షకులు తమ మొబైల్‌ ఫోన్ల  నుంచి ఈ పాటను షేర్‌ చేశారు. పార్వతి విన్నపానికి డోన్‌ ఆర్టీసీ అధికారులు స్పందించారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. డోన్‌  నుంచి దేవనకొండకు వెళ్లే బస్సును లక్కసాగరం మీదుగా తిప్పుతున్నారు.  

అభినందన సభ 
తన పాటతో గ్రామానికి బస్సు వచ్చే విధంగా చేసిన పార్వతికి ఆదివారం లక్కసాగరంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగర్‌ స్మితతో పాటు గ్రామ పెద్దలు లక్ష్మిరెడ్డి, రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. స్వార్థం లేకుండా పార్వతి తన ఊరికి బస్సు కావాలని కోరడం అభినందనీయమన్నారు. అనంతరం బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. తన పాటకు అధికారులు స్పందించి బస్సు సర్వీస్‌ ఏర్పాటు చేయడంతో సంతోషంగా ఉందని దాసరి పార్వతి తెలిపారు.  కర్నూలు నుంచి బండపల్లె గ్రామానికి బస్సు వస్తోందని, దానిని తమ గ్రామం వరకు పొడిగించాలని కోరారు. తనకు పాటలంటే చిన్నప్పటి నుంచి ప్రాణమని తెలిపారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మంచి గాయనిగా స్థిరపడి,  పేద పిల్లలకు తన వంతు సాయం చేస్తానని చెప్పారు. 

మరిన్ని వార్తలు