చంద్రబాబు వంటి చెలికాడు ఈ ముజ్జగాలలో ఎక్కడున్నాడు?

7 Aug, 2022 19:11 IST|Sakshi

ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని చంద్రబాబు కలవడంపై ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. గత కొన్నాళ్లుగా అన్ని రకాల ఎన్నికల్లో ఓడి ప్రజల్లో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఢిల్లీలో ఎంత ఘనకీర్తి ఉందో టీడీపీ కార్యకర్తలే అడగకముందే చెబుతారు. అంతేందుకు సొంత పార్టీ ఎంపీలే చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ముందుకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పట్ల మోదీ అపారమైన వినయ విధేయతలు ప్రదర్శించారంటూ ఎల్లో మీడియాలో వార్తలు రావడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రాసిన వార్తలకు సంబంధించి ఎల్లో మీడియాకు చురకలంటించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇంకెన్నాళ్లు అబద్దాలు చెప్పి జాకీలేసి లేపుతారంటూ నేరుగా ప్రశ్నించారు. 

మరో రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీ మోహన రావు తనదైన శైలిలో చంద్రబాబు పర్యటనను విశ్లేషించారు.

బాబును చూడగానే మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.  కళ్ళు జలపాతాలయ్యాయి.  దేహం మీదున్న అన్ని వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. "బాబూ...." అని పెద్దగా అరిచాడు.  

చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదు.  మామూలుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఇతర నాయకులతో మాట్లాడుతున్నారు.  ఫరూక్ అబ్దుల్లా అయితే బాబు చేయిని వదలలేదు.  "వంకాయవంటి కూరయు, పంకజముఖి సీతవంటి పత్నియు, చంద్రబాబు వంటి చెలికాడు ఈ ముజ్జగాలలో ఎక్కడున్నాడు?" అంటూ శివరంజని రాగంలో  పాటను ఆలపించారు. 

అక్కడున్న జాతీయనాయకులు అందరూ బాబును చుట్టుముట్టారు.  అభినందలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.  అయితే బాబు మాత్రం చలించలేదు. చాల గుంభనంగా ఉండిపోయారు. 

ఇక అక్కడ తనకు బాబును కలవడానికి వీలుకాదని భావించిన మోదీ బాబు చేయిని ఆప్యాయంగా పట్టుకుని తెరవెనక్కు తీసుకెళ్లారు.  

"బాబూ..స్నేహితుల దినోత్సవం రోజున అక్కడినుంచి ఇంతదూరం వచ్చి నన్ను కలిసి నిజమైన స్నేహితుడివి అనిపించుకున్నావు.  గతంలో నువ్వు నన్ను అనేకంగా ఛండాలంగా తిట్టావు.  నా భార్యను, అమ్మను కూడా దూషించావు.  నన్ను మోసగాడిని అన్నావు.  అయినా నేను గత ఐదేళ్లలో నిన్ను ఒక్కమాట కూడా అనలేదు.  ఎందుకంటే నీ సంగతి నాకు తెలుసు.  స్నేహానికి, బంధుత్వానికి ప్రాణం ఇచ్చేవాడివి నీవు.  నీ మనసు హెరిటేజ్ వెన్న అని నాకు బాగా తెలుసు. అందుకే నీ స్నేహం కోసం అయిదేళ్లనుంచి తపస్సు చేస్తున్నాను.  ఇన్నాళ్లకు నన్ను కరుణించావా బాబూ....రాబోయే ఎన్నికల్లో నువ్వు నాకు ఒక్క సీటు ఇచ్చినా సరే,  నేను, నా పార్టీ మొత్తం నీవెంటే ఉంటాము.  పొత్తులు కాల్చి తిని అవతలపారేసే మొక్కజొన్నపొత్తులు అని నాకు తెలుసు.  నువ్వంటే నాకు ఎంతో ఇష్టం.  నువ్వు కనీసం వారానికొకమారైనా ఢిల్లీ రావాలి.  నాకు ఏపీకి వద్దామని ఉంది కానీ నాలుగేళ్లక్రితం "మోడీ గో బాక్" అని హోర్డింగులు పెట్టావు కదా..  అందుకే నీ మాటను గౌరవించి నేను విజయవాడ రాలేదు.  ఏమీ అనుకోవద్దు "  అంటూ బాబును వాటేసుకుని గిరగిరా తిప్పారు మోడీ.  

చంద్రబాబు మాత్రం ఏమీ బదులివ్వకుండా "ఆలోచిస్తా"  అన్నట్లుగా తలఊచి తన ఎంపీలతో బయటకు వెళ్లిపోయారు!

ఇక నెటిజన్లు కూడా చంద్రబాబు పర్యటనపై తమ స్థాయిలో స్పందించారు.

ఈసారికి రాష్ట్రపతిని , ఉపరాష్ట్రపతిని  మీకు చెప్పకుండా  ఎంపిక చేసినందుకు మమ్మల్ని మన్నించండి బాబు ... గతంలో మీరు ఎందరో రాష్ట్రపతులను,  ప్రధానులను తయారు చేసేవారు.... కానీ ఈ మధ్య మీకు  వయసు మీద పడిందని  .. దానికి తోడుగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తరువాత  మతి చెడిందని.... వేళకు సరిగా  మందులు కూడా వేసుకోవడం లేదని విన్నాం... అందుకే ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని...  మేమే రాష్ట్రపతిని , ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసుకున్నాం... మరేమీ  అనుకోవద్దు బాబు...అని... మోదీ గారు బ్రతిమలాడేసరికి  ఐదు నిమిషాలు అయిపోయిందట ...
సరే .... మీకు నేను ఇచ్చిన ఐదు నిమిషాల సమయం అయిపోయింది...  మీరు ఇంకా ఏదైనా నాతో చెప్పాలి అనుకుంటే మరో సారి కలిసినప్పుడు చెప్పండి... నాకు  ఇప్పుడు సమయం లేదని ... బాబు గారు బయటకు వచ్చేశారట.. !

ఇక చంద్రబాబు మోదీని కలవడం ఒక చరిత్రాత్మక భేటీ అన్నట్టుగా… వచ్చిన వార్తలను ఆటాడుకున్నారు నెటిజన్లు. 

చంద్రబాబు గుణం అర్థమయ్యాక మోదీ, షా కిలోమీటర్ల దూరం ఉంచుతున్నారు తనను… గత ఎన్నికల ముందు… దేశంలో చంద్రబాబు స్థాయిలో మోదీని అన్నిరకాలుగా అవమానించి, వ్యతిరేకించిన నాయకుడు ఇంకొకరు లేరు… అడ్డగోలుగా ఓడిన తరువాత గానీ బాబుకు తత్వం బోధపడలేదు… సారీ, ఆ తత్వమే అది కదా… ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా పోలేడు… జడుపు… మోదీ ఇక జన్మలో నమ్మడు…

ప్రత్యేకంగా మోడీ చంద్రబాబును పక్కకు పిలిచి అయిదు నిమిషాలు మాట్లాడాడట… మీరు మమ్మల్ని మరిచిపోయారు, ఇలాగైతే మేం ఏమైపోవాలి, దేశం కోసమైనా మీరు అప్పుడప్పుడూ ఢిల్లీ వస్తుండాలి… మీ ఇల్లు అనుకొండి, మీతో చాలా మాట్లాడాల్సి ఉంది, ప్లీజ్ అని మోడీ పదే పదే మొహమాటపెట్టేశాడు. 

సర్లే, మరీ అంతగా బతిమిలాడకు, అప్పుడప్పుడూ వస్తుంటాలే అని చంద్రబాబు మోదీకి అభయహస్తం చూపి, ధైర్యాన్నిచ్చాడు అన్నట్టుగా ఉన్నాయి . థాంక్ గాడ్, చంద్రబాబు తిరిగి వచ్చేస్తున్నప్పుడు కారు దాకా నడిచివచ్చి వీడ్కోలు పలికాడని రాయలేదు..!!

మొత్తమ్మీద చంద్రబాబు పర్యటన, ప్రధానిని కలవడంపై ఎల్లో మీడియా అతిగా స్పందించి నవ్వులపాలయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. 

ఇదీ చదవండి: ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు షాక్‌.. ఎంపీ కేశినేని వైఖరితో నిర్ఘాంతపోయిన బాబు

మరిన్ని వార్తలు