రివర్స్‌ టెండరింగ్‌తో రూ.44.15 కోట్లు ఆదా 

27 Sep, 2022 06:30 IST|Sakshi
హంద్రీ–నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ

రూ.1,219 కోట్లతో పీబీసీ విస్తరణ పనులు 

బిడ్లు దాఖలు చేసిన ఎన్‌సీసీఎల్, ఎంఈఐఎల్‌ కంపెనీలు 

0.1997 శాతం లెస్‌తో ఎల్‌–1గా నిలిచిన ఎన్‌సీసీ లిమిటెడ్‌   

బి.కొత్తకోట: జలవనరుల శాఖలో రివర్స్‌ టెండరింగ్‌తో కోట్లు ఆదా అవుతున్నాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో సాగే ఏవీఆర్‌ హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల ప్రారంభంలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 20న ప్రాజెక్టు మదనపల్లె ఎస్‌ఈ సీఆర్‌ రాజగోపాల్‌ కంపెనీల సాంకేతిక అర్హతలను పరిశీలించగా సోమవారం కంపెనీలు దాఖలుచేసిన ప్రైస్‌బిడ్‌ను తెరిచారు.

ఇందులో హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ రివర్స్‌ టెండరింగ్‌లో లెస్‌కు టెండర్‌ దాఖలు చేసి ఎల్‌–1గా నిలిచింది.  అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె నుంచి హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)పై కిలోమీటరు 79.600 నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలో కిలోమీటరు 220.350 వరకు కాలువను విస్తరించే పనులకు ప్రభుత్వం రూ.1,219,93,02,150 అంచనాతో టెండర్లను ఆహ్వానించింది.

ఈ పనులు దక్కించుకునేందుకు నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ లిమిటెడ్, మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ టెండర్లు దాఖలు చేశాయి. తొలుత టెండర్లను దాఖలు చేసిన కంపెనీల సాంకేతిక అర్హత, అనుభవం, సామర్థ్యంపై డాక్యుమెంట్లను ఈనెల 20న పరిశీలించగా రెండింటీకి అర్హత ఉన్నట్లు నిర్ధారౖణెంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ప్రైస్‌బిడ్‌ను తెరిచారు.

ఇందులో నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ అంచనాకంటే 3.42 శాతం అదనంతో  రూ.1,261,65,18,283.53కు టెండర్‌ దాఖలు చేసింది. అనంతరం దీనిపై ఎస్‌ఈ రాజగోపాల్‌ రివర్స్‌ టెండరింగ్‌ ప్రారంభించి సా.5.30 గంటలకు ముగించారు.

ఇందులో రెండు కంపెనీలు పోటీపడినా చివరికి నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ప్రభుత్వ అంచనా విలువకంటే 0.1997 శాతం తక్కువకు అంటే..రూ.1,217,49,40,146.53తో టెండర్‌ దాఖలుచేసి ఎల్‌–1గా నిలిచింది. ఈ రివర్స్‌ టెండర్‌ నిర్వహణవల్ల ప్రభుత్వానికి రూ.44,15,78,137 ఆదా అయ్యింది. ఇక ఎల్‌–1గా నిలిచిన కంపెనీకి పనుల అప్పగింత కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఎస్‌ఈ చెప్పారు.  

మరిన్ని వార్తలు