చంద్రబాబు హయం అవకతవకలు.. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట

3 May, 2023 13:48 IST|Sakshi

ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. 

చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో  సిట్ దర్యాప్తునకు  ఆదేశించింది. అయితే.. ఆ సిట్‌ నియామకంపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.

దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు.. సీబీఐ , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో  స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్‌ ప్రస్తావించింది. ఈ తరుణంలో.. హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 

దీంతో చంద్రబాబు ప్రభుత్వం లోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయ్యింది. మరోవైపు అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు విధానాల లో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఆటంకాలు తొలిగాయి. 

ఇక కేసు విచారణ సమయంలో.. సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 

‘‘ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం.. తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి?. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని వ్యాఖ్యానించింది బెంచ్‌. 

బలంగా ఏపీ ప్రభుత్వ వాదనలు..  

ఇక ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని, ఈ కేసును సీబీఐ అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. అలాగే.. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదనలు వినిపించింది. దీంతో ఏపీ ప్రభుత్వ వాదనలతో జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవిస్తూ.. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ను నిజంగా అంత అభిమానిస్తే అలా ఎలా చేశావ్‌?

మరిన్ని వార్తలు