గిఫ్ట్‌ కార్డుల పేరుతో వసూలు 

15 Sep, 2022 04:02 IST|Sakshi
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గిఫ్ట్‌కార్డులు, ఉత్తరాలు

కార్లు, బైక్‌లు వచ్చాయంటూ ఉత్తరాలు

ఫోన్‌ చేసినవారిని మభ్యపెట్టి.. జీఎస్టీ పేరుతో డబ్బులు వసూలు

చిత్తూరు జిల్లాలో లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న బాధితులు

బిహార్‌కు చెందిన ప్రధాన నిందితుడితో పాటు నలుగురు అరెస్టు

నకిలీ గిఫ్ట్‌కార్డులు, 30 సెల్‌ఫోన్లు, 30 ఏటీఎం కార్డులు స్వాధీనం  

చిత్తూరు అర్బన్‌: గిఫ్ట్‌కార్డుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కార్లు, బైక్‌లు వచ్చాయంటూ నమ్మబలికి.. జీఎస్టీ, ఎన్‌వోసీ తదితరాల పేర్లతో లక్షలాది రూపాయలు కొట్టేసిన బిహార్, కర్ణాటకకు చెందిన నిందితులను పోలీసులు చిత్తూరులో చాకచక్యంగా పట్టుకున్నారు.

ఈ వివరాలను బుధవారం చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివరాలు.. బిహార్‌కు చెందిన ముకేశ్‌కుమార్‌ ఆన్‌లైన్‌ ద్వారా పలు వస్తువులు కొనుగోలు చేసిన 5 లక్షల మంది చిరునామాలను సంపాదించాడు. ప్రతి ఒక్కరి అడ్రస్‌కు ఓ ఉత్తరం, ఈ–కామర్స్‌ కంపెనీల స్టాంప్‌ ముద్రలతో గిఫ్ట్‌కార్డులు పంపించేవాడు. ఆ బహుమతిని సొంతం చేసుకునేందుకు తమను సంప్రదించాలంటూ ఆ ఉత్తరాల్లో తమ ఫోన్‌ నంబర్లు ఉంచేవాడు.

ఇలా చిత్తూరు జిల్లాలో పలువురికి ఉత్తరాలతో పాటు గిఫ్ట్‌కార్డులు వచ్చాయి. వాటిని స్క్రాచ్‌ చేసి చూడగా.. కార్లు, బైకులు గెల్చుకున్నట్లు ఉంది. దీంతో వారు ఉత్తరంలోని నంబర్లకు ఫోన్‌ చేయగా.. కారు పంపించేందుకు గాను జీఎస్టీ కింద రూ.5 వేలు కట్టాలని నమ్మబలికారు. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన 26 మంది.. నిందితుడు చెప్పిన బ్యాంకు ఖాతాకు ఆ సొమ్మును జమ చేశారు. ఆ తర్వాత ఎన్‌వోసీ కోసమని, ట్యాక్స్‌ చెల్లించాలని రకరకాల పేర్లతో మభ్యపెట్టి రూ.లక్షల్లో వసూలు చేశారు.

చివరకు తాము మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ రిషాంత్‌రెడ్డి.. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. వన్‌టౌన్‌ సీఐ నరసింహరాజు, పెనుమూరు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తదితర సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రధాన నిందితుడు ముకేశ్‌తో పాటు కర్ణాటకకు చెందిన సందేష్, కిరణ్, హెచ్‌ఎస్‌ కిరణ్, జైనుల్‌ అబిద్‌లను చిత్తూరులోని ఫారెస్టు రోడ్డులో పట్టుకున్నారు.

నిందితుల నుంచి నకిలీ గిఫ్ట్‌కార్డులు, 30 సెల్‌ఫోన్లు, 30 ఏటీఎం కార్డులు, రెండు ల్యాప్‌టాప్‌లు, రూ.1.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించి.. నగదు రివార్డులు అందజేశారు.  

మరిన్ని వార్తలు