డుండుండుం పిపిపి.. మే, జూన్‌ నెలల్లో 24 పెళ్లి ముహూర్తాలు.. గృహ ప్రవేశాలకు మాత్రం...

1 May, 2023 20:45 IST|Sakshi

రెండు నెలల్లో మొత్తం 24 శుభ ముహూర్తాలు  

మే, జూన్‌ నెలల్లో మోగనున్న పెళ్లి బాజాలు

వివాహాలకు అనువైన తేదీలను ప్రకటించిన పండితులు

సాక్షి, అమరావతి: మండు వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే, జూన్‌ నెలల్లో దాదాపు 24 శుభముహూర్తాలు ఉన్నట్టు పండితులు ప్రకటించారు. గత శుభకృతు నామ సంవత్సరం(2022–23)లో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వచ్చిన శుభ ముహూర్తాలకు ఏపీ, తెలంగాణలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. మళ్లీ నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 12 వరకు పెళ్లిళ్లు జరిగాయి.

డిసెంబర్‌ 16 నుంచి ఈ ఏడాది జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో వివాహాలు చేయలేదు. జనవరి 19 నుంచి మార్చి 9 వరకు మొత్తం 18 శుభ ముహూర్తాలు వచ్చాయి. మళ్లీ నెల రోజుల విరామం తర్వాత తాజాగా మే నెలలో 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 తేదీలతో పాటు జూన్‌లో 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు ప్రకటించారు.

ఇప్పుడు కాకుంటే మరో 2 నెలలు బ్రేక్‌..
మే మాసం అంతా వరుసగా మంచి ముహూర్తాలున్నాయి. జూన్‌ నెలలో కూడా 18వ తేదీ వరకు అనువైన ముహూర్తాలు బాగానే ఉన్నాయి. 19వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలుకానుండటంతో మళ్లీ శుభకార్యాలకు బ్రేక్‌ పడనుంది. ఆషాఢ మాసం జూలై 18 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసం, అధిక శ్రావణ మాసం ఆగస్టు 17 వరకు ఉంటుంది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో పెళ్లిళ్లకు బ్రేక్‌ పడుతుందని పండితులు చెబుతున్నారు.

వివాహాలకే.. గృహ ప్రవేశాలకు అనుకూలించవు
ప్రస్తుత వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో దాదాపు 25 మంచి ముహూర్తాలున్నాయి. వీటిలో చాలా ముహూర్తాలు పెళ్లిళ్లు, ఉపనయనాలకు బాగా అనుకూలిస్తాయి. మే 11 నుంచి 24వ తేదీ వరకు అగ్ని కార్తె ఉండటంతో ఆ సమయంలో వచ్చే ముహూర్తాలు గృహ ప్రవేశాలకు అనుకూలించవు. జూన్‌ నెలాఖరు వరకు ముహూర్తాలున్నప్పటికీ ఆషాఢం వస్తుంది. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు ముహూర్తాలు ఉండవు. అందుకే మే, జూన్‌ నెల మొదట్లోనే వివాహాలు జరిపించేందుకు చాలా మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
– కొత్తపల్లి సూర్యప్రకాశరావు, పురోహితుడు, భీమవరం 

మరిన్ని వార్తలు