తరగతి గదిలో 16 మందే

31 Oct, 2020 02:43 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో 2వ తేదీ నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

విద్యార్థులు, టీచర్లకు ఇబ్బంది కలగకుండా చర్యలు

ఒక్కో విద్యార్థి మధ్య దూరం 6 అడుగులు

టెన్త్‌ మినహా తక్కిన విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు

టీచర్లు రోజూ స్కూళ్లకు రావలసిందే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. కోవిడ్‌–19 నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలని నిర్ణయించారు. ఒక్కో విద్యార్థికి మధ్య దూరం 6 అడుగులు ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువిడిచి రోజు తరగతుల నిర్వహణ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు.  

నవంబర్‌ నెలంతా హాఫ్‌ డే స్కూళ్లే
► నవంబర్‌ నెలంతా స్కూళ్లు హాఫ్‌డే మాత్రమే (ఉదయం 9 నుంచి 1.30 వరకు) ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు.
► విద్యార్థులు రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు.
► ప్రారంభంలో 9వ తరగతికి ఒకరోజు పెడితే మరునాడు 10వ తరగతి పిల్లలకు తరగతులు పెట్టాలి
► నవంబర్‌ 23 నుంచి 6, 8 తరగతులకు ఒకరోజు, 7, 9 తరగతులకు మరునాడు తరగతులు నిర్వహించాలి.
► డిసెంబర్‌ 14 నుంచి 1, 3, 5, 7, 9 తరగతులకు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులకు మరుసటిరోజు తరగతులు పెట్టాలి.
► టెన్త్‌ విద్యార్థులకు ప్రతి రోజూ తరగతులు నిర్వహించాలి.
► ఏ స్కూలులో అయినా 750 మందికి మించి విద్యార్థులున్నట్లయితే వారిని మూడు బ్యాచులుగా చేసి మూడేసి రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలి.
► టీచర్లు రోజూ స్కూళ్లకు హాజరవ్వాలి. ఉదయం తరగతుల బోధన, మధ్యాహ్నం ఆన్‌లైన్‌ బోధనలో పాల్గొనాలి.

హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్వహణ ఇలా..
► హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లను అక్కడి వసతిని బట్టి నిర్ణీత నిబంధనలను పాటిస్తూ 9–12 తరగతుల పిల్లలతో నవంబర్‌ 2వ తేదీనుంచి ప్రారంభించవచ్చు.
► నిబంధనలకు అనువుగా తగినంత వసతి లేని పక్షంలో నవంబర్‌ 23 నుంచి ప్రారంభించాలి.
► అప్పటివరకు ఆ విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ స్కూళ్లలోని తరగతులకు హాజరవ్వడం లేదా ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా ఆయా పాఠ్యాంశాలు నేర్చుకొనేలా చూడాలి.
► 3 నుంచి 8వ తరగతి పిల్లలకు సంబంధించి నిబంధనలు తరువాత విడుదల చేస్తారు. అప్పటివరకు ఈ విద్యార్థులు సమీపంలోని స్కూళ్లలోని తరగతులకు హాజరై అక్కడ మధ్యాహ్న భోజనం తీసుకోవచ్చు.

అకడమిక్‌ క్యాలెండర్‌ ఇలా..
► రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను అన్ని పాఠశాలలు అనుసరించాలి.
► నవంబర్‌ 2 నుంచి 2021 ఏప్రిల్‌ 30 వరకు మొత్తం 180 రోజులకు తగ్గట్టుగా క్యాలెండర్‌ ఉంటుంది. 
► ఆదివారాలు, సెలవు దినాల్లో స్కూళ్లు మూసిఉన్న రోజుల్లో పిల్లలు ఇంటినుంచే చదువుకొనేలా ప్రణాళిక ఉంది. 
► తల్లిదండ్రుల కమిటీలతో సంప్రదించి ప్రతి రోజూ స్కూళ్లను పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి. 
► పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు తగిన పౌష్ఠికాహారం మధ్యాహ్న భోజనం ద్వారా అందించాలి. మధ్యాహ్న భోజనం అమలులో కోవిడ్‌ జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలి. మూడో వంతు మంది చొప్పున విడతల వారీగా పంపాలి.
► ప్రతిఒక్కరూ మాస్కు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి.
► ఉదయం స్కూళ్లు తెరవగానే  కోవిడ్‌ ప్రతిజ్ఞ చేయించి జాగ్రత్తలపై 15 నిమిషాలు బోధించాలి. 

మరిన్ని వార్తలు