ఇక్కడ ఆడుతూ.. పాడుతూ..పాఠాలు నేర్పుతారు

9 Apr, 2021 15:25 IST|Sakshi

కేజీబీవీల్లో అభ్యసనానికి వినూత్న పద్ధతులు 

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా చర్యలు 

నాణ్యమైన పదార్థాలతో రోజుకో మెనూ  

విజయనగరం అర్బన్‌: అనాథ, నిరుపేద బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో వినూత్న బోధన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఒత్తిడిలేని విద్యను అందించేందుకు వీలుగా ఆటపాటలతో, విజ్ఞానదాయక అంశాలపై దృష్టిసారించారు. ఆరోగ్యంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం సాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థినులకు రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు ఇటీవలే వారి డైట్‌ చార్జీలను కూడా పెంచింది. చదువుల ఒత్తిడి లేకుండా విద్యార్థినులకు యోగాతో పాటు ఆటపాటలతో అభ్యసనం సాగించేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. పదోతరగతి, ఇంటర్‌మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో విద్యార్థినులకు ఉత్తీర్ణత శాతం ఏటేటా పెరుగుతోంది.  
శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా... 
జిల్లాలో 33 కేజీబీవీలున్నాయి. టెన్త్, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై విద్యా శాఖ దృష్టి పెట్టింది. అర్హులైన బోధనా సిబ్బందిని నియమించి ఆయా సబ్జెక్టుల్లో బోధన అందిస్తోంది. విద్యార్థినులకు యోగాతోపాటు వారికి ఆసక్తి ఉన్న వివిధ క్రీడల్లో, ఇతర కళాంశాల్లో రాణించేలా సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. దీనివల్ల ఒకప్పుడు 80 శాతం దాటని ఉత్తీర్ణత మూడేళ్లుగా పెరుగుతూ రావడం విశేషం. పదోతరగతిలో 2017–18 లో 96.7 శాతం, 2018–19లో 97.56 శాతం, గత ఏడాది శతశాతం ఫలితాలు సాధించడం గమనార్హం. 


దశలవారీగా విస్తరణ 
జిల్లాలో 33 కేజీబీవీలున్నాయి. అన్ని వర్గాలకు చెందిన నిరుపేద, అనాథ బాలికలు 8,206 మంది అందులో విద్యాబోధన పొందుతున్నారు. 6 నుంచి 10 వరకు తరగతుల నిర్వహణతోపాటు గతేడాది నుంచి ఇంటర్‌ తరగతులు కూడా ప్రారంభించారు. దీనికి అనుగుణంగా అదనపు భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టించింది. జిల్లాలోని 16 మోడల్‌ స్కూళ్లలో హాస్టళ్లు లేకపోవడంతో అక్కడి బాలికల కోసం కేజీబీవీల్లో వసతి గృహాలను ప్రారంభించారు. మోడల్‌ స్కూళ్లు, ఇతర స్కూళ్లలో చదివే విద్యార్థినులకు అక్కడే అవాసం కల్పిస్తున్నారు.  
నాణ్యమైన పదార్థాలతో రోజుకో మెనూ 
కేజీబీవీ విద్యార్థినులకు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోంది. కరోనా అనంతరం పునఃప్రారంభమైనా ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయిస్తూ వాటి వ్యాప్తిని నిరోధించింది. వసతి గృహాల్లోని భోజన సౌకర్యం మెరుగుపర్చి, డైట్‌ చార్జీలను రూ.1,400కు పెంచింది. మోనూలో కూడా పలు మార్పులు చేసింది. రోజుకో రకమైన పదార్థాలతో సరికొత్త మెనూ రూపొందించి ఆ మేరకు అన్ని కేజీబీవీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం లేచినవెంటనే ప్రీ బ్రేక్‌ ఫాస్ట్, బ్రేక్‌ ఫాస్ట్, లంచ్, ఈవెనింగ్‌ స్నాక్స్, డిన్నర్‌ తరువాత పండ్లు అందిస్తున్నారు. మాంసాహారులకు చికెన్, శాకాహారులకు కాయగూరలు అందిస్తున్నారు. పాలు, రాగిజావ, రాగి సంగటి, బూస్ట్, చిక్కీలు, ఊతప్పం, ఇడ్లీలు, పూరీలు, ఆలూ బఠానీ కుర్మా, చపాతీ, కోడుగుడ్లు, అన్నం, రోజకోరకమైన కూరలు ఇలా వివిధ రకాల వంటకాలతో విద్యార్థినులకు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. 

మెరుగైన ఫలితాల కోసం ప్రణాళికలు 
నిరుపేద, అనాథ బాలికల విద్యాబోధన కోసం నిర్వహిస్తున్న కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఒత్తిడి లేని బోధన, అభ్యసనాలను అమలు చేస్తున్నాం. ఈ నేపధ్యంలోనే టెన్త్‌ ఫలితాలు ఏటా పెరుగుతున్నాయి. జిల్లాలోని 33 కేజీబీవీల్లో 8,206 మంది బాలికలకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నాం. 
– జె.విజయలక్ష్మి, ఏపీసీ, ఎస్‌ఎస్‌ఏ  

( చదవండి: క్రీడాకారులకు ‘సాక్షి’ ప్రోత్సాహం భేష్ )

మరిన్ని వార్తలు