సారూ... పిల్లలతో పని చేయిస్తే ఎలా? 

23 Apr, 2022 17:49 IST|Sakshi
ట్రాక్టర్‌కు కట్రాళ్లు లోడు చేస్తున్న విద్యార్థులు 

కేవీపల్లె(అన్నమయ్య జిల్లా): ‘సారూ.. మేము పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే.. మీరు పని చేయిస్తే ఎలా?’ అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదులకు తాళం వేశారు. ఈ సంఘటన మారేళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆవరణలో స్టేజీ నిర్మించాలని ప్రధానోపాధ్యాయులు గంగాధరం, ఉపాధ్యాయులు భావించారు.

బుధవారం విద్యార్థులతో గుణాతం తవ్వకం పని చేపించారు. గురువారం నిర్మాణానికి అవసరమయ్యే కట్రాళ్ల కోసం వారిని ఓ బండకు పంపించి ట్రాక్టర్‌కు లోడు చేయించారు. సిమెంట్‌ బస్తాలను ఆటోకు లోడు చేయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చెంది పాఠశాల వద్దకు వచ్చారు. స్థానిక సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డి సహకారంతో శుక్రవారం తరగతి గదులకు తాళాలు వేశారు. తమ బిడ్డలతో పనులు చేయించిన వారిపై చర్యలు తీసుకునే వరకు తాళాలు తీయరాదని డిమాండ్‌ చేశారు.

పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు చెట్ల కింద తరగతులు నిర్వహించారు. దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉపాధ్యాయులను నిలదీశారు. గురువారం హెచ్‌ఎం గంగాధరం లేకపోయినా, ఆయన ఆదేశాల మేరకే పిల్లలతో పని చేయించామని ఇన్‌చార్జి హెచ్‌ఎం వెంకటసుబ్బయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు సర్ది చెప్పి తాళాలు తెరిపించారు. అనంతరం విద్యార్థులకు ఆలస్యంగా సమ్మేటివ్‌ పరీక్షలు నిర్వహించారు. జరిగిన సంఘటనపై ఎంఈవో రెడ్డిబాషాను వివరణ కోరగా విచారణ జరిపి డీఈవోకు నివేదిక పంపిస్తామని తెలిపారు. 

పిల్లలచే పని చేయించడం అన్యాయం
మా పిల్లలతో పని చేయించడం అన్యాయం. మేము కష్టపడి పిల్లలను బాగా చదివించుకోవాలని పాఠశాలకు పంపిస్తున్నాం. అయితే ఎర్రటి ఎండలో బండపైకి పంపించి కట్రాళ్లు ట్రాక్టర్‌కు లోడు చేయించడం ఎంత వరకు సమంజసం. పాఠశాల పేరెంట్స్‌ కమిటీకి ఉపాధ్యాయుల జవాబుదారీతనం లేదు.
– రమణయ్య, పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్

మరిన్ని వార్తలు