ప్రైమరీ స్కూళ్లపై ఏం చేద్దాం?

18 Jan, 2021 04:10 IST|Sakshi

విద్యా శాఖ సమాలోచన  

నేటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు

కోవిడ్‌ జాగ్రత్తల మధ్య విద్యార్థులకు తరగతులు

సాక్షి, అమరావతి: సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రంలోని స్కూళ్లు కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించేలా విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. పాఠశాలలు కోవిడ్‌ కారణంగా దాదాపు 5 నెలలు ఆలస్యంగా నవంబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. స్కూళ్లలో 9, 10 తరగతులు, జూనియర్‌ కాలేజీల్లో 12వ తరగతి విద్యార్థులను తల్లిదండ్రుల అనుమతితో భౌతిక దూరం పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలకు అనుమతించారు. ఆ తర్వాత 6, 7, 8 తరగతుల వారికీ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక పాఠశాలలను ఈ విద్యాసంవత్సరానికి ప్రారంభించాలా? వద్దా? అన్న అంశంపై విద్యాశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, టీచర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలను సంక్రాంతి సెలవుల్లో విద్యాశాఖ పూర్తిచేసింది. దాదాపు 76 వేల మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సోమవారం నుంచి స్కూళ్లు కొందరు కొత్త టీచర్లతో ప్రారంభం కానున్నాయి.  

ఉదయం తరగతులు.. తర్వాత ఆన్‌లైన్‌లో
పాఠశాలల నిర్వహణకు సంబంధించిన క్యాలెండర్‌ను ఎస్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులు రోజూ తరగతులకు హాజరుకావాలని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో 7, 9వ తరగతి విద్యార్థులు, ప్రతి మంగళ, గురు, శనివారాల్లో 6, 8 తరగతుల విద్యార్థులు .. గతంలో మాదిరిగానే తరగతులకు హాజరు కావాలని సూచించింది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు స్కూళ్లు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌ బోధనను కొనసాగించాలని ఎస్‌సీఈఆర్టీ ఆదేశించింది. సోమవారం నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు కూడా ప్రారంభించాలని అన్ని కాలేజీలకు ఇంటర్‌ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం పనిదినాలను 106కు తగ్గిస్తున్నారు. కాగా, వృత్తి విద్యాయేతర డిగ్రీ కోర్సుల ఫస్టియర్‌ ప్రవేశాల గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈనెల 21 వరకు పొడిగించింది. ఇక ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల ఫస్టియర్‌ ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థులు సోమవారం కాలేజీల్లో రిపోర్టు చేయకపోతే.. సీట్లు రద్దు అవుతాయి.

ట్రిపుల్‌ ఐటీల్లో తరగతుల ప్రారంభం నేడే..
నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 కల్లా క్యాంపస్‌లలో రిపోర్ట్‌ చేయాలని అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు సూచించారు.

ఇంటర్‌ ఫస్టియర్‌ వార్షిక షెడ్యూల్‌ 
► జనవరి 18 నుంచి మార్చి 31 వరకు ఫస్ట్‌ టర్మ్‌
► మార్చి 25 నుంచి 31 వరకు అర్థ సంవత్సర పరీక్షలు
► ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు సెకండ్‌ టర్మ్‌
► ఏప్రిల్‌/మేలో ఫైనల్‌ పరీక్షలు (తేదీలు ఖరారు చేయలేదు)
► అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను తరువాత ప్రకటిస్తారు.
► 2020–21 ఫస్టియర్‌ విద్యార్థులకు సెకండియర్‌ (2021–22 విద్యాసంవత్సరం) తరగతుల ప్రారంభం జూన్‌ 3. 

మరిన్ని వార్తలు