AP: పాఠశాలలు పునఃప్రారంభం: ఉత్సాహంగా విద్యార్థులు

17 Aug, 2021 08:08 IST|Sakshi
కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లు మండలపరిషత్‌ ప్రాథమిక స్కూల్లో మాస్కులతో విద్యార్థులు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌ 20వతేదీ నుంచి స్కూళ్లు దీర్ఘకాలం మూతపడిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు నెలల పాటు ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు స్కూళ్లు పునఃప్రారంభంతో ఉత్సాహంగా వస్తున్నారు. 

ఉత్సాహంగా విద్యార్థులు..
కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సూచనలతో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పూర్తిస్థాయిలో తెరవాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ శనివారమే అన్ని స్కూళ్లకు సవివరంగా సర్క్యులర్‌ పంపింది. స్థానిక పరిస్థితులను అనుసరించి స్కూళ్లవారీగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ) అమలు చేసేలా కార్యాచరణ చేపట్టింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి.

కడప: విద్యార్థినులకు టెంపరేచర్‌ పరీక్షిస్తున్న టీచర్‌
నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన స్కూళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయమే ఉత్సాహంగా వచ్చిన విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సదుపాయాలను చూసి సంబరంతో మురిసిపోతున్నారు. మరోపక్క ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 47 లక్షల మందికిపైగా విద్యార్థులకు తొలిరోజే జగనన్న విద్యాకానుక కింద స్టూడెంట్‌ కిట్ల పంపిణీ కూడా ప్రారంభం కావడం విశేషం. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులందరికీ కిట్లను విద్యాశాఖ పంపిణీ చేసింది. ఈ నెల 31వ తేదీవరకు విద్యార్థులకు కిట్లను  అందించనున్నారు.

ఆనందడోలికల్లో...
నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన స్కూళ్లకు వచ్చిన చిన్నారులు తమ బడి రూపురేఖలు పూర్తిగా మారిపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆహ్లాదకరమైన రంగులు, అందమైన చిత్రాలు, తరగతి గదుల్లో సౌకర్యంగా ఉన్న డ్యూయెల్‌ డెస్కులు వారిని ఆనందంలో ముంచెత్తాయి. మంచినీటి సదుపాయం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, పచ్చిక బయళ్లతో పచ్చగా మారిన పాఠశాల ఆవరణను తిలకించిన విద్యార్థుల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సెకండియర్‌ విద్యార్థులకు కూడా ప్రత్యక్ష తరగతులు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఈ విద్యార్థులకు జూలై 1 నుంచి ఆన్‌లైన్‌ బోధన జరుగుతుండగా తాజాగా తరగతుల్లో ప్రత్యక్ష బోధనను ఆరంభించారు. తరగతులకు చాలాకాలం దూరంగా ఉండడంతో జూనియర్‌ కాలేజీల్లో సైతం విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

విశాఖ: మధురానగర్‌ పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన బెంచీలపై విద్యార్థినులు

పూర్తిగా తెరుచుకోని ప్రైవేట్‌ విద్యాసంస్థలు...
ప్రైవేట్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలోని స్కూళ్లలో తొలిరోజు కొన్ని మాత్రమే తెరుచుకున్నాయి. కొన్ని చోట్ల వచ్చే వారం తెరుస్తామని పేర్కొనగా మరికొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండురోజులు ఆగి ప్రారంభిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. జూనియర్‌ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రైవేట్‌ కాలేజీలు మాత్రం తరగతులు ప్రారంభించాయి. 

ప్రభుత్వ స్కూళ్లలో పెరగనున్న చేరికలు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పరిధిలో 61,208 పాఠశాలలుండగా 73 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 45 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లు కాగా తక్కినవి ప్రైవేట్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో 43.33 లక్షల మందికిపైగా, ఎయిడెడ్‌ స్కూళ్లలో 1.96 లక్షలు, ప్రైవేట్‌ స్కూళ్లలో 27.77 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు కొనసాగుతున్నందున ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు ఇంకా పెరుగుతాయని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 
చదవండి: నూతన విధానంలో ఆరు రకాలుగా పాఠశాలలు

మరిన్ని వార్తలు