రేపటి నుంచే స్కూళ్లు.. పిల్లల ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం

15 Aug, 2021 03:57 IST|Sakshi

రేపటి నుంచి స్కూళ్ల పునఃప్రారంభం సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అన్ని తరగతులూ ప్రారంభం

మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి

సెక్షన్‌కు 20 మంది విద్యార్థులుండేలా ఏర్పాట్లు

గదులు సరిపోకపోతే రోజు విడిచి రోజు తరగతులు

టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ దాదాపు పూర్తి

తరగతి గదులు, పరిసరాలు పూర్తిగా శానిటైజ్‌

అభ్యసన సామర్థ్యాల మెరుగు కోసం ఫౌండేషన్‌ విద్య

ప్రైమరీ, హైస్కూల్‌ ఓకే ఆవరణలో ఉన్న చోట్ల ముందుగా అమలు

రూ.3,600 కోట్లతో నాడు–నేడు తొలిదశ పూర్తి.. రేపు ప్రజలకు అంకితం 

48 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక

నాణ్యత లేని వస్తువులుంటే హెచ్‌ఎంలు వెనక్కు పంపాలి

రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు తగ్గినప్పటికీ, విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తరగతి గదుల్లో, బయట పూర్తిగా శానిటైజ్‌ చేయడంతో పాటు మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేసింది. పిల్లల ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేసింది. 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంది. కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం స్కూళ్ల వారీగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ప్రతి స్కూల్‌కు ప్రత్యేకంగా ఎస్‌ఓపీ) రూపొందించి, అమలు చేస్తోంది. సోమవారం నుంచి అన్ని తరగతులు ప్రారంభం కానున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికే టీచర్లకు వ్యాక్సినేషన్‌ దాదాపు పూర్తి చేశారు. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టినందున ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. అయినప్పటికీ పిల్లల ఆరోగ్య భద్రత ముఖ్యమైన అంశం కాబట్టి, ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా సెక్షన్‌కు 20 మంది ఉండేలా చర్యలు తీసుకుంది.

ఇందుకు గదులు సరిపోకపోతే 6, 7, 8 తరగతులకు ఒక రోజు, 9, 10 తరగతులకు మరుసటి రోజు (రోజు విడిచి రోజు) తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమికంగా అంటే 1, 2, 3 తరగతులకు ఒక రోజు, 4, 5 తరగతులకు మరుసటి రోజు తరగతులు ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో విద్యార్థులు స్కూళ్లకు రావాల్సి ఉంటుంది. పాఠశాల తరగతి గదుల్లోనే కాకుండా ఆవరణలో, బయట పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా శానిటైజ్‌ చేయిస్తున్నారు. పిల్లల్లో ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వారిని వేరుగా ఉంచేందుకు ఐసోలేషన్‌ రూమును  ఏర్పాటు చేస్తున్నారు. ఆ వెంటనే సమీపంలోని పీహెచ్‌సీ, ఆసుపత్రికి తెలియచేసి, వారికి వైద్యం అందేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఫౌండేషన్‌ విద్యతో అందలం
బాల్య దశలోనే విద్యార్థులకు బలమైన పునాది వేయాలన్న లక్ష్యంలో భాగంగానే ప్రభుత్వం ఫౌండేషన్‌ స్కూళ్ల విధానాన్ని ప్రారంభిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపర్చకముందే రాష్ట్రంలో దీనిపై చర్యలు చేపట్టారు. ఫౌండేషన్‌ విద్య ద్వారా భవిష్యత్తులో మన విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను సులువుగా అందుకోగలిగే స్థాయికి చేరుకుంటారు. ఇప్పటివరకు ఉన్న వ్యవస్థలో ఆ మేరకు ప్రమాణాలు నెలకొల్పే అవకాశం లేనందునే కొత్త విధానం తీసుకొస్తున్నారు. 5+3+3+4 విధానంలో శాటిలైట్‌ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్, ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌ విధానంలో స్కూళ్లు ఉంటాయి. ఇందుకు సంబంధించి మ్యాపింగ్‌ పూర్తయింది. తొలుత అంగన్‌వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు ఒకే ఆవరణలో లేదా పక్కపక్కనే ఉన్న చోట్ల ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. మిగిలిన చోట్ల అంచెలంచెలుగా రెండేళ్లలో కొత్త విధానం అమల్లోకి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

నాడు–నేడుతో మౌలిక సదుపాయాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా మనబడి నాడు–నేడు పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఎంఆర్‌సీ, భవిత కేంద్రాల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. తొలి విడతలో 15,715 స్కూళ్లలో రూ.3,600 కోట్లకు పైగా నిధులతో వివిధ సదుపాయాలు కల్పించింది. ఇదంతా సమాజం ఆస్తి కనుక, వీటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల కమిటీలను ఈ పనుల పర్యవేక్షణలో భాగస్వామ్యం చేసింది. హెడ్మాస్టర్లు, టీచర్లు, తల్లిదండ్రుల కమిటీలు అభివృద్ధి చేసిన స్కూళ్లను జాగ్రత్తగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం పలు సూచనలు చేసింది. మరుగుదొడ్ల నిర్వహణకు ఆయాలను ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు వేతనాన్ని పెంచింది. రెండో విడతలో రూ.4,800 కోట్లతో 16 వేల పాఠశాలల అభివృద్ధి పనులకు ఈనెల 16న శ్రీకారం చుట్టనుంది.

ప్రభుత్వ చర్యలతో పెరిగిన చేరికలు
విద్యారంగంలో సీఎం జగన్‌ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇంటర్మీడియెట్, డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్లో నిర్వహిస్తున్నారు. తద్వారా పారదర్శకత ఏర్పడడంతో పాటు రిజర్వేషన్లు తప్పక అమలవుతాయి. ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ చర్యల కారణంగా స్కూళ్లలో విద్యార్థులు గతంలో కంటే 6 లక్షల మందికి పైగా పెరిగారు. కొత్తగా 2.5 లక్షల మంది స్కూళ్లలో చేరారు. డ్రాపవుట్ల శాతం బాగా తగ్గింది. 

బోధనా సామర్థ్యం పెంపుపై దృష్టి
బోధనలో నాణ్యతా ప్రమాణాలను పెంచడం అత్యంత ఆవశ్యకం. ఇందుకు ఉపాధ్యాయులు ముఖ్యపాత్ర పోషించాలి. ఇందుకోసం ప్రభుత్వం వారికి శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం ఒంగోలులో ఏర్పాటు చేస్తున్న ఆంధ్రకేసరి ప్రకాశం యూనివర్సిటీ ద్వారా టీచర్‌ ఎడ్యుకేషన్‌పై మరింతగా దృష్టి సారించనుంది.

స్కూళ్లు తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు ఇలా..
10% కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లోనే స్కూళ్లు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసినందున వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి వారం కోవిడ్‌ కేసులను గుర్తిస్తుండాలి. బోధన, బోధనేతర సిబ్బంది ప్రతిరోజూ హాజరు కావాలి. రెగ్యులర్‌ సమయం ప్రకారమే తరగతులు కొనసాగాలి. అన్ని విద్యా సంస్థల్లో కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలి. పోర్టబుల్‌ థర్మల్‌ స్కానర్‌తో ప్రవేశద్వారం వద్దే విద్యార్థులను పరిశీలించాలి. కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే ఇంటికి పంపి, పరీక్షలు చేయించుకోమని చెప్పాలి. శానిటైజర్‌ ఏర్పాటు చేసి, తరచూ చేతులు శుభ్రం చేసుకోమని చెప్పాలి. స్కూలు అసెంబ్లీ, గ్రూప్‌ వర్కులు, గేమ్స్‌ వంటివి నిర్వహించరాదు. తరగతి గదుల్లో 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలి. టాయిలెట్ల వద్ద, భోజనాల సమయంలోనూ ఇది పాటించాలి. తరగతి గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి. ఇళ్లలో వృద్ధులైన తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు ఉంటే పరిస్థితులు చక్కబడే వరకు ఇళ్ల వద్దనే ఉండాలి. రోగగ్రస్థులుగా ఉన్న విద్యార్థులను స్కూళ్లకు అనుమతించరాదు. మధ్యాహ్న భోజన పదార్థాలను వేర్వేరు సమయాల్లో వేర్వేరు తరగతుల విద్యార్థులకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలి. పాఠశాల వదిలినప్పుడు గుంపుగా బయటకు పంపకూడదు. ప్రతి వారం ప్రతి స్కూలులో ఇద్దరు విద్యార్థులు, సిబ్బంది నుంచి ఒకరికి ర్యాండమ్‌ టెస్టులు చేయాలి. ఎవరికైనా పాజిటివ్‌ లక్షణాలుంటే అందరికీ పరీక్షలు చేయించాలి. కోవిడ్‌పై తీసుకోవలసిన జాగ్రత్తలకు  పీరియడ్‌ను కేటాయించాలి. స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే ప్రతి విద్యార్థి స్నానం చేసేలా అవగాహన కల్పించాలి. పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్‌లు, పుస్తకాలు, వాటర్‌ బాటిళ్లు, గ్లాసులు ఇచ్చిపుచ్చుకోవడం నిషేధం. టాయిలెట్లను రోజూ శుభ్రం చేయించాలి. స్కూలు బస్సుల్లేని పిల్లలను తల్లిదండ్రులే స్కూళ్ల వద్ద దింపాలి. ప్రతి స్కూలులో కోవిడ్‌ జాగ్రత్తల అమలుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి. మిగిలిపోయిన టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి.

కట్టుదిట్టంగా విద్యా కానుక 
జగనన్న విద్యాకానుక కిట్లను రూ.800 కోట్లతో ఈనెల 16 నుంచి 31వ తేదీలోగా రాష్ట్రంలోని దాదాపు 48 లక్షల మంది విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పంపిణీలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బ్యాగుపై విద్యార్థి పేరు, తరగతి, కిట్లలోని వస్తువులను పొందుపరుస్తున్నారు. 3 జతల యూనిఫాం క్లాత్, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌ బుక్కులు, నోట్‌ బుక్కులు తదితరాలను కిట్‌ రూపంలో అందిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మాధ్యమం ప్రవేశపెట్టినందున పక్కపక్క పేజీల్లో ఇంగ్లిష్, తెలుగులో మిర్రర్‌ ఇమేజ్‌లో ఉండే బైలింగ్యువల్‌ పాఠ్యపుస్తకాలను అందిస్తున్నారు. దీనికి తోడు విద్యార్థులకు సులభంగా ఆయా పదాలు అర్థం చేసుకోవడానికి 1–5వ తరగతి వరకు బొమ్మలతో ఉన్న డిక్షనరీలు, 6–10 తరగతుల విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు అందిస్తున్నారు. యూనిఫాం వస్త్రం, షూ కొలత సరిగా లేకున్నా, బ్యాగు నాణ్యత బాగోలేకున్నా వెనక్కు పంపి, మంచివి తెప్పించుకోవాలని చెప్పింది. లోపాలున్న వాటిని సెప్టెంబర్‌ 15 కల్లా తిరిగి పంపి ఆ విషయాన్ని రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయాలి. టోల్‌ ఫ్రీ నంబర్‌ 9154296169కు ఫిర్యాదు చేయొచ్చు. జగనన్న విద్యాకానుకపై యాప్‌ను కూడా రూపొందించారు.  

విద్యా రంగానికి వైఎస్‌ జగన్‌ పెద్దపీట
మంత్రి ఆదిమూలపు సురేష్‌ 
పి.గన్నవరం : విద్య మీద పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్‌కు పెట్టుబడి.. అనే మహోన్నత ఆలోచనతో సీఎం వైఎస్‌ జగన్‌ ఏటా విద్యా రంగానికి బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నాడు–నేడు కింద రాష్ట్రంలో మొదటి విడతలో ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలలను సీఎం ఈ నెల 16న ప్రజలకు అంకితం చేస్తున్న తరుణంలో ఇక్కడ తలపెట్టిన సభ ఏర్పాట్లను మంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.  

మరిన్ని వార్తలు