Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ‘గణగణ’

4 Jul, 2022 03:29 IST|Sakshi

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం

ఈసారి ఆరు రకాలుగా విద్యాసంవత్సరం ఆరంభం 

పునాది విద్యను బలోపేతం చేస్తూ ఫౌండేషన్‌ స్కూళ్లు 

స్కూళ్లు తెరిచే రోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక  

సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ స్కూల్‌ రెడీనెస్‌ కార్యక్రమాన్ని జూన్‌ 28నుంచే ఆరంభించింది. పాఠశాలల్లో పరిశుభ్రత, ఫర్నిచర్, మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయాలతో పాటు మధ్యాహ్న భోజనం కోసం కిచెన్‌ షెడ్లు, వంట పరికరాలను సిద్ధం చేసింది. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందించనున్నారు. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5వ తేదీనుంచి నెలాఖరు వరకు విద్యార్థులకు అందచేస్తారు. 

కొత్త విధానంలో స్కూళ్లు 
జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను పునర్వ్యవస్థీకరించి ఆరు రకాల విభాగాలుగా ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రారంభించనుంది. పునాది విద్యను బలోపేతం చేయడంలో భాగంగా ఫౌండేషన్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. స్కూళ్ల మెర్జింగ్, టీచర్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. విలీనమైన స్కూళ్లలో 3, 4, 5 తరగతుల విద్యార్ధులు సమీపంలోని ప్రీహైస్కూలు, హైస్కూళ్లలోకి వెళ్లనున్నారు. అక్కడ వారికి సబ్జెక్టు టీచర్లతో బోధనతో పాటు హైస్కూళ్లలోని ల్యాబ్‌లు, ఆటస్థలాలు, లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. 

వర్కింగ్‌ డేస్‌ 220  
ఫౌండేషన్‌ స్కూళ్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి. గేమ్స్, రెమిడియల్‌ తరగతుల కోసం ఆప్షనల్‌ పీరియడ్‌ను 3.30 నుంచి 4.30 వరకు కొనసాగిస్తారు. హైస్కూళ్లు  ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పనిచేస్తాయి. ఆప్షనల్‌ పీరియడ్‌ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉంటుందని క్యాలెండర్‌లో పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 220 రోజులు స్కూళ్ల పని దినాలుగా ఉంటాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్‌ లాంటి సెలవులన్నీ కలిపి 80 రోజులు ఉంటాయి. సమ్మేటివ్, ఫార్మేటివ్, టెన్త్‌ ప్రీఫైనల్‌ పరీక్షల తాత్కాలిక తేదీలను కూడా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.   

పెరుగుతున్న చేరికలు  
విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. మనబడి నాడు–నేడు కింద రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. జగనన్న విద్యాకానుక కింద విద్యార్ధుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఏటా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది.

పాఠశాలలను సిద్ధం చేయడంలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లను భాగస్వాముల్ని చేసింది. గోరుముద్ద, ఎంటీఎఫ్‌ నిర్వహణను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇతర సిబ్బందికి అప్పగించింది. అడ్మిషన్ల కోసం ఇంటింటి సందర్శన చేపట్టి ప్రభుత్వ పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలను టీచర్లు నిర్వహిస్తున్నారు. 3, 4, 5 తరగతుల విలీనాన్ని అనుసరించి పిల్లల తరలింపు, టీచర్ల సర్దుబాటు బాధ్యతలను క్షేత్రస్థాయిలో ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఈవోలు చర్యలు చేపట్టారు.

ఇవీ 6 విభాగాలు
శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2),  ఫౌండేషన్‌ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, 1, 2వతరగతులు) 
ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, 1 నుంచి 5వ తరగతివరకు) 
ప్రీ హైస్కూళ్లు (3వ తరగతి నుంచి 7, 8వ తరగతి వరకు) 
హైస్కూలు (3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) 
హైస్కూలు ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) 

మరిన్ని వార్తలు