పొగాకు రహిత ప్రాంతాలుగా పాఠశాలలు

20 Jan, 2022 03:59 IST|Sakshi

100 గజాల్లోపు ప్రాంతంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం

9 ప్రమాణాలతో ప్రత్యేక యాప్‌

పాఠశాలలు ఆ 9 ప్రమాణాలను పాటించేలా చర్యలు

సాక్షి, అమరావతి: పాఠశాలలు, వాటి పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల రహిత వాతావరణం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే విద్యా సంస్థల ప్రహరీల నిర్మాణంతో పాటు, పాఠశాలకు వంద గజాల్లోపు ప్రాంతంలో సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా విద్యాసంస్థలు, వాటి పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా ఉండేలా ఇతర కార్యక్రమాలు చేపడుతోంది. వైద్యారోగ్య శాఖ ఇతర శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

విద్యా సంస్థలను పొగాకు రహిత ప్రాంతంగా ధ్రువీకరించేలా 9 ప్రమాణాలతో వైద్య శాఖ ‘టుబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌’(టోఫీ) పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చి.. దానిని ఏపీ ఏఎన్‌ఎం హెల్త్‌ యాప్‌తో అనుసంధానించింది. ఏఎన్‌ఎంలు తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి.. ప్రభుత్వం సూచించిన 9 ప్రమాణాలను పాటిస్తున్న పాఠశాలల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 51,717 పాఠశాలలుండగా.. ఇప్పటి వరకూ 14,020 తొమ్మిది పాఠశాలలు ప్రభుత్వ ప్రమాణాలను సంపూర్ణం చేశాయి.

ఆ 9 ప్రమాణాలు.. 
► విద్యా సంస్థ ఆవరణలో పొగాకు రహిత ప్రాంతం అనే సంకేతాలతో సైన్‌ బోర్డ్‌ల ఏర్పాటు.
► పాఠశాల ద్వారం బయట పొగాకు రహిత విద్యా సంస్థ అనే సైన్‌ బోర్డ్‌ ఏర్పాటు
► పాఠశాల ఆవరణ లోపల పొగాకు ఉత్పత్తులను వినియోగించిన ఆధారాలు లేకుండా ఉండాలి.
► గోడల మీద పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలపను వివరించే, ఇతర అవగాహన పద్ధతుల ప్రదర్శన.
► పొగాకు నియంత్రణ కార్యకలాపాలను గత 6 నెలల్లో ఒక్కసారైనా నిర్వహించడం.
► పొగాకు పర్యవేక్షకుడి నియామకం 
► పాఠశాలను పొగాకు రహితంగా నిర్ణయించడం.
► సరిహద్దు గోడ బయట 10 గజాల దూరాన్ని గుర్తించి.. కాల్చి పడేసిన సిగరెట్‌ ముక్కలు, గుట్కా, ఖైనీ కవర్లు, వీటిని నమిలి ఉమ్మిన ఆనవాళ్లు లేకుండా చూడటం 
► 100 గజాల్లోపు పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సంఖ్యను నివేదించడం.   

మరిన్ని వార్తలు