సృజనకు సాన.. వైజ్ఞానిక ప్రదర్శన

24 Nov, 2022 16:50 IST|Sakshi

నూతన ఆవిష్కరణలకు వేదిక

విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంపు లక్ష్యం

ఉమ్మడి ‘పశ్చిమ’ వ్యాప్తంగా ప్రారంభమైన సైన్స్‌ ప్రదర్శనలు

ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచి.. వారి ఆలోచనలకు సానపెట్టి నూతన ఆవిష్కరణలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞాన శాస్త్రం, గణితం, పర్యావరణాన్ని ముడి సరుకులుగా వినియోగించి సృ‘జన’హితమైన ఆవిష్కరణలు తీసుకువచ్చేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సమాయత్తం చేస్తున్నారు. విజ్ఞాన ప్రదర్శనల ద్వారా చిన్నతనం నుంచే ఆవిష్కరణల ఆలోచనలు పెంచేలా మార్గదర్శకం చేస్తున్నారు. 

దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాల స్థాయిలో సైన్స్‌ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన విజ్ఞాన 
ప్రదర్శనల్లో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి వాటిని మండల స్థాయికి పంపుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనల్లో 
తమ నైపుణ్యాన్ని రంగరించి మండల స్థాయి అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి తమ ఆవిష్కరణలు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో కనిపిస్తోంది. వారికి గైడ్‌ టీచర్లు సూచనలిస్తూ మరింత పదును పెడుతూ ప్రోత్సహిస్తున్నారు. 

పాఠశాల స్థాయి నుంచే ప్రదర్శనలు 
విద్యార్థుల్లో సహజంగా ఉండే బెరుకును పోగొట్టడానికి తొలుత వారి ఆవిష్కరణలను తమతో ఎప్పుడూ తిరిగే, తాము రోజూ చూసే సహ విద్యార్థుల మధ్యనే ఈ ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో మొదటగా వారు చదివే పాఠశాలలోనే విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే ఏర్పాటుచేసింది. దీని ద్వారా తోటి విద్యార్థుల నుంచి వెల్లడయ్యే అభిప్రాయాలు, వారి నుంచి అందుకునే అభినందనలు విద్యార్థులకు సగం బలాన్నిస్తాయనేది ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలో ఈనెల 22, 23 తేదీల్లో పాఠశాల స్థాయిలో విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు.  

ఆవిష్కరణలకు మార్గనిర్దేశనం 
విద్యార్థులు ఆవిష్కరణలు చేయడానికి తగిన అంశాలను వెతుక్కోవాల్సిన పనిలేకుండా ప్రభుత్వమే కొన్ని అంశాలను సూచించింది. ఈ మేరకు విద్యార్థు లు పర్యావరణ అనుకూల పదార్థాలపై, ఆరోగ్యం, పరిశుభ్రతపై, సాఫ్ట్‌వేర్‌–యాప్స్‌ అభివృద్ధి, పర్యావరణం–వాతావరణ మార్పులు, గణిత నమూనాలు అనే అంశాలపై తమ ప్రాజెక్టులను సిద్ధం చేశారు. ఆయా ప్రాజెక్టులను పాఠశాల స్థాయిలో మంగళ, బుధవారాల్లో ప్రదర్శించారు.

మండల స్థాయికి ఐదు చొప్పున.. 
పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన వాటిలో ఉత్తమమైన ఐదు ప్రాజెక్టులను ఎంపిక చేసి మండల స్థాయి ప్రదర్శనలకు పంపనున్నారు. ఇలా ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు మండల స్థాయిలో ప్రదర్శనకు వెళ్లనున్న నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంది. వచ్చేనెల 12, 13వ తేదీల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో మండల స్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.  

సృజనాత్మకతకు పెంచేలా..  
విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తికి పదును పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాల స్థాయి ప్రదర్శనలు పూర్తయ్యాయి. కేవలం ప్రాజెక్టులు రూపొందించేలా ప్రోత్సహించడంతో పాటు ఆయా ప్రాజెక్టులను చూసి ఇతర విద్యార్థులు స్ఫూర్తి పొందడం ప్రదర్శనల ఉద్దేశం. అలాగే ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మిగిలిన పిల్లలు ఇటుగా ఆలోచించేలా కృషిచేస్తున్నాం. అందుకే పాఠశాల స్థాయిలో నిర్వహించిన ప్రదర్శనలకు సమీపంలోని ఇతర పాఠశాలల విద్యార్థులను కూడా తీసుకువెళ్లి వారికి ప్రాజెక్టులను పరిచయం చేయాలని సంబంధిత స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం.  
– ఆర్‌ఎస్‌ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు

మరిన్ని వార్తలు