'ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతారు'.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..

17 Sep, 2022 15:43 IST|Sakshi
వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ అవుతున్నది పోస్టు ఇదే

అనంతపురం అగ్రికల్చర్‌: రెండు మూడు రోజులుగా వాట్రాప్‌ గ్రూపుల్లో వైరల్‌ అవుతున్న ఫొటోలు, సందేశాలు నిరాధారమైనవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.మల్లీశ్వరి తెలిపారు. “పత్తి పంటలో ఒక పురుగు ఉంది. ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతున్నారు... జాగ్రత్తగా ఉండండి’ అంటూ అందరూ ఆందోళనకు గురయ్యేలా పురుగు ఫొటోలు, చనిపోయిన మనుషుల ఫొటోలు, ఆడియో సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ పూర్తీగా అవాస్తవమని పేర్కొన్నారు.

అలాంటి పురుగు పత్తి పంటకు అసలు ఆశించదని, అది ఎక్కువగా చెరకు, పండ్ల తోటల్లో కనిపిస్తుందన్నారు. లద్దె పురుగు ఆకారంలో శరీరంపై వెంట్రుకలు కలిగి ఉంటుందన్నారు. వెంట్రుకల చివరి భాగంలో స్వల్ప విషపూరిత పదార్థం ఉంటుందన్నారు. ఒకవేళ ఆ పురుగు మనిషి శరీరాన్ని తాకినా కేవలం తగిలిన చోట దురద , లేదంటే చిన్నగా వాపు వస్తుందని, ఒకట్రెండు రోజుల్లో తగ్గిపోతుందని స్పష్టం చేశారు. రైతులు, ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. 

చదవండి: (AP: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ)

 
    

మరిన్ని వార్తలు