సాగర గర్భంలో శోధన 

23 Mar, 2021 04:16 IST|Sakshi
హిందూ మహాసముద్రంలో అన్వేషణకు బయలుదేరిన ఆర్‌వీ సింధు సాధన నౌక

జీవరాశులు, లోహాలు, వాతావరణ పరిస్థితులపై అన్వేషణ

విశాఖ నుంచి బయల్దేరిన ఆర్‌వీ సింధు సాధన నౌక

30 మంది శాస్త్రవేత్తలతో 90 రోజుల పర్యటన

గోవాలో ముగియనున్న పరిశోధన యాత్ర  

సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో కంటికి కనిపించే వివిధ రకాల జీవరాశుల గురించి మనకు తెలుసు. మరి అవి కాకుండా సాగర గర్భంలో ఇంకా ఏముంది? అక్కడి జీవ వైవిధ్యం.. వాతావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? తదితర అంశాలను అన్వేషించేందుకు విశాఖ నుంచి శాస్త్రవేత్తల బృందం ఈ నెల 15న బయల్దేరింది.

ఆర్‌వీ సింధు సాధన నౌకలో వెళ్లిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషినోగ్రఫీ(సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐవో)కి చెందిన 30 మంది శాస్త్రవేత్తల బృందం హిందూ మహా సముద్ర గర్భంలోని విశేషాలను అన్వేషిస్తున్నారు. ఇతర మహా సముద్రాలతో పోలిస్తే హిందూ సముద్రంలో పరిశోధనలు చాలా తక్కువగా జరిగాయి. అందుకే ఇక్కడ సముద్ర గర్భంలో ఏం దాగుందో అన్వేషించే బాధ్యతను సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐవో భుజానికెత్తుకుంది. 

జీవుల జన్యు వైవిధ్య మ్యాపింగ్‌.. 
సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐవో సముద్ర గర్భంలోని జీవుల జన్యు వైవిధ్యాన్ని మ్యాపింగ్‌ చేయడమే లక్ష్యంగా ప్రాజెక్టును ప్రారంభించింది. హిందూ మహాసముద్రంలో కంటికి కనిపించని జీవరాశులు ఎన్ని రకాలున్నాయి, లోహాలు, వాతావరణ పరిస్థితులు, బ్యాక్టీరియా తదితరాలను అన్వేషించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘ట్రేస్‌ బయోమీ’ అని పేరు పెట్టారు. 
► 30 మంది శాస్త్రవేత్తల బృందం 90 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించనుంది. వీరి యాత్ర దాదాపు 9,000 నాటికల్‌ మైళ్ల దూరం సాగనుంది. మే నెలలో గోవాలో వీరి పరిశోధన ముగియనుంది. 
► ఒక జీవి పుట్టుక, పెరుగుదల, జీవితచక్రం విశేషాలపై పరిశోధన, నీటిలో ఉన్న లోహనిక్షేపాల వివరాలతో పాటు అవక్షేపాలు ఎంత మేర ఉన్నాయనే దానిని పరిశీలిస్తారు. 
► అలాగే సముద్ర గర్భంలోని నీటి సాంద్రత, ఫ్లోరైడ్, వాటర్‌ టోటల్‌ హార్డ్‌నెస్, పీఏ లెవల్స్‌ ఎంతమేర ఉన్నాయి? జీవరాశులకు అవసరమైన ఆహారముందా? లేదా? మొదలైన వాటిపై పరిశోధనలు నిర్వహిస్తారు.   
► హిందూ మహాసముద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నీరు, పాచి, జీవరాశుల విస్తృత నమూనాల్ని సేకరించి అధ్యయనం చేస్తారు. ఇందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు.  
► సేకరించిన నమూనాల్లో ఉన్న లోహాలు, సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ జీవుల దశలు.. మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తారు. ముఖ్యంగా గ్లోబల్‌ ట్రాన్‌్రస్కిప్టోమ్, మెటాజెనోమ్‌ విశ్లేషణలు నిర్వహిస్తారు. 
► మనకు కావల్సిన మెడిసిన్లకు అవసరమైన బ్యాక్టీరియా, శిలీంద్రాల పరిశోధన జరగనుంది. భవిష్యత్‌లో వాతావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని తెలుసుకోడానికి కూడా ఈ పరిశోధన ఉపయోగపడుతుంది. 

సాగర గర్భ లోతుల్ని అన్వేషిస్తాం.. 
హిందూ మహా సముద్రం అడుగు భాగంలో అతి తక్కువ పరిశోధనలు జరిగాయి. ఇప్పటివరకు ఉపరితలంపైనా.. అక్కడ్నుంచి కొన్ని కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే పరిశోధనలు చేశారు. ఈసారి మా శాస్త్రవేత్తల బృందం సాగర గర్భ లోతుల్ని అన్వేషించనుంది. సముద్ర జీవుల్లో జన్యు పరమైన మార్పులు, వాటి ప్రత్యేకతలు, ఆ జీవుల వల్ల కలిగే లాభనష్టాల్ని పరిశోధిస్తాం. సముద్ర గర్భంలోని వాతావరణ మార్పులు, వాటి వల్ల భవిష్యత్‌లో వచ్చే మంచి, చెడులపైనా సమాచారం సిద్ధం చేస్తాం. 90 రోజుల్లో ఈ యాత్ర పూర్తయినా.. ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి మాత్రం మూడేళ్లు పడుతుంది.
– డా.జి.ప్రభాకర్‌ ఎస్‌ మూర్తి, సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐవో చీఫ్‌ సైంటిస్ట్‌  

మరిన్ని వార్తలు