పెద్దవాగుతో మొదలు

12 Oct, 2021 04:50 IST|Sakshi

పరిధిపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్న గోదావరి బోర్డు 

ప్రయోగాత్మకంగా ఆ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చూడనున్న బోర్డు

రాష్ట్రాల సిబ్బంది ఎక్కడి వారక్కడే

సాక్షి, అమరావతి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిపై ప్రాథమికంగా స్పష్టత వచ్చింది. రెండు రాష్ట్రాల అంగీకారం మేరకు ఈ నెల 14 నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్‌ అయిన పెద్దవాగును తొలి దశలో బోర్డు తన పరిధిలోకి తీసుకోనుంది. శ్రీరాంసాగర్‌ నుంచి సీతమ్మసాగర్‌ వరకు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలన్న ఏపీ డిమాండ్‌పై తెలంగాణ సర్కార్‌ అభ్యంతరం తెలిపింది. దాంతో.. పరిస్థితులపై అధ్యయనం చేసి ఆ ప్రాజెక్టులను దశలవారీగా బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తామని బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ చెప్పారు. 

పెద్దవాగు, సీలేరుపైనే కీలక చర్చ
ప్రాజెక్టుల పరిధి, సిబ్బంది నియామకం, నిధులు తదితర అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు సోమవారం పూర్తిస్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన జరిగిన భేటీలో ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ కార్యదర్శులు శ్యామలరావు, రజత్‌కుమార్, ఈఎన్‌సీలు నారాయణరెడ్డి, మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్సార్‌ఎస్పీ నుంచి సీతమ్మసాగర్‌ వరకు చేపట్టిన అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు.

ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నుంచే గోదావరి ప్రవాహాలు దిగువకు రావాల్సి ఉందని, ఎగువన తెలంగాణ అనేక ప్రాజెక్టులు చేపట్టి నీటిని వినియోగించడంతో పాటు ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా చెరువులన్నింటినీ నింపుకుంటోందని తెలిపారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. పెద్దవాగు కింద ఉన్న 16 వేల ఎకరాల ఆయకట్టులో 13 వేల ఎకరాలు ఏపీలోనే ఉన్నందున ఆ ప్రాజెక్ట్‌ నిర్వహణ వ్యయంలో ఏపీ 85 శాతం చెల్లించాలని తెలంగాణ అధికారులు కోరారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా పెద్దవాగును తమ పరిధిలోకి తెచ్చుకొని, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు చూస్తామని బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ స్పష్టం చేశారు.

ఏ రాష్ట్ర సిబ్బంది ఆ రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తారని తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో చర్చించి.. పెద్దవాగును బోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని రెండు రాష్ట్రాల అధికారులు చెప్పారు. సీలేరు విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ అధికారులు కోరడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ జోక్యం చేసుకుంటూ.. ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని, దానిపై తర్వాత చర్చిద్దామని చెప్పారు.

బడ్జెట్‌ ఉద్దేశం చెబితే సీడ్‌మనీ ఇస్తాం
బోర్డులకు ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్‌మనీ అంశంపైనా చర్చ జరిగింది. కేవలం ఒక్క ప్రాజెక్టునే బోర్డు పరిధిలో ఉంచినప్పుడు రూ.200 కోట్ల నిధులు అవసరం ఏముంటుందని రెండు రాష్ట్రాల అధికారులు ప్రశ్నించారు. అదీగాక నిధుల విడుదల ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నందున బడ్జెట్‌ ఉద్దేశాలను బోర్డు తమకు చెబితే ఆర్థిక శాఖకు తెలియజేస్తామని వివరించారు. 

కొలిక్కిరాని కృష్ణా బోర్డు పరిధి
తెలంగాణ జల వనరులు, జెన్‌కో అధికారుల దాటవేత ధోరణి వల్ల కృష్ణా బోర్డు పరిధి కొలిక్కి రాలేదు. గెజిట్‌ నోటిఫికేషన్‌లో షెడ్యూల్‌–2 ప్రాజెక్టుల వివరాలను సోమవారం ఇస్తామని ఆదివారం చెప్పిన తెలంగాణ అధికారులు ఆ తర్వాత మాట మార్చారు. దాంతో పరిధి, స్వభావంపై ముసాయిదా నివేదికను అసంపూర్తిగానే కృష్ణా బోర్డుకు సబ్‌ కమిటీ కన్వీనర్‌ ఆర్కే పిళ్లై అందించారు. పరిధిపై నిర్ణయాధికారాన్ని మంగళవారం జరిగే కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించారు. ఆదివారం కృష్ణా బోర్డు సబ్‌ కమిటీ సమావేశంలో ప్రాజెక్టుల వివరాలను సోమవారం ఇస్తామని తెలంగాణ అధికారులు చెప్పడంతో సోమవారం రాత్రి సబ్‌ కమిటీ మరోసారి భేటీ అయ్యింది. కానీ.. తెలంగాణ అధికారులు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.

తెలంగాణ వాదనపై ఏపీ జల వనరుల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో తెలంగాణ ఇష్టారాజ్యంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ.. ఏపీ హక్కులను కాలరాస్తుండటం వల్లే జల వివాదం ఉత్పన్నమైన అంశాన్ని ఎత్తిచూపారు. జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తీసుకోకుండా ప్రాజెక్టులను మాత్రమే పరిధిలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు. ఈ వాదనతో సబ్‌కమిటీ కన్వీనర్‌ పిళ్లై ఏకీభవించారు. బోర్డు పరిధి, స్వరూపంపై బోర్డుకు నివేదిక ఇచ్చేందుకు సబ్‌కమిటీ రూపొందించిన ముసాయిదాపై తెలంగాణ అధికారులు సంతకం చేయడానికి నిరాకరించగా.. ఏపీ అధికారులు సంతకం చేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు