పశుసంవర్ధక శాఖకు స్కోచ్‌ అవార్డుల పంట

18 Mar, 2023 05:08 IST|Sakshi

వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలకు సిల్వర్‌ స్కోచ్‌..

వెటర్నరీ టెలి మెడిసిన్‌ కాల్‌ సెంటర్‌కు.. పశు వ్యాధుల నిర్ధారణ ల్యాబ్స్‌..

ఆంధ్ర గో పుష్టి కేంద్రాలకు స్కోచ్‌ మెరిట్‌ అవార్డులు

గతంలో ఎన్నడూ లేని రీతిలో గుర్తింపు

సాక్షి, అమరావతి: రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు 2023–24 సంవత్సరానికి సంబంధించి స్కోచ్‌ అవార్డుల పంట పండింది. ఈ శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలకు సిల్వర్‌ స్కోచ్‌ దక్కగా, వెటర్నరీ టెలి మెడిసిన్‌ కాల్‌ సెంటర్, పశువుల వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌్సతో పాటు ఆంధ్ర గోపుష్టి కేంద్రానికి స్కోచ్‌ మెరిట్‌ అవార్డులు వరించాయి. దేశంలోనే వినూత్నంగా నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్రంలో తొలిసారిగా రూ.240 కోట్లతో 340 సంచార పశు ఆరోగ్యసేవా రథాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ద్వారా ఇప్పటివరకు 3,298 ఆర్బీకేల పరిధిలో 2.25 లక్షల పశువులకు వైద్యసేవలందించగా, 2.02 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు.

అలాగే, దేశంలోనే తొలిసారి రూ.7 కోట్లతో టెలిమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా రైతుల నుంచి వచ్చిన 1.46 లక్షల ఫోన్‌కాల్స్‌ను అటెండ్‌ చేశారు. శాస్త్రవేత్తలు, సంబంధిత వైద్యాధికారుల ద్వారా సలహాలు సూచనలు అందిస్తున్నారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించాలన్న సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటుచేసిన 154 వైఎస్సార్‌ వెటర్నరీ ల్యాబ్స్‌ ద్వారా ఇప్పటివరకు 3.09 లక్షల శాంపిల్స్‌ పరీక్షించి సకాలంలో అవసరమైన వైద్య సేవలు అందించగలిగారు. అదే విధంగా రూ.17.40 కోట్లతో 58 వైఎస్సార్‌ దేశవాళీ గో జాతులపెంపకం కేంద్రాలను ఏర్పాటుచేసారు.

ఒక్కో కేంద్రానికి 20 దేశీ ఆవులు, ఓ ఆంబోతును అందించారు. వీటినుంచి సేకరించే పాల ద్వారా తయారుచేసే ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్టి పేరిట విక్రయించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా గో పుష్టి కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ­లో దీనిని ఏర్పాటుచేయగా ఇందుకు విశేష ఆదరణ లభిస్తోంది. త్వరలో విశాఖ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రిలలో ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమాలకే స్కోచ్‌ సంస్థ 2023 సంవత్సరానికి సిల్వర్, మెరిట్‌ సర్టిఫికెట్లకు ఎంపిక చేసింది. 

వరుసగా అవార్డులే అవార్డులు
ఇక పాడి పరిశ్రమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు గతంలో ఎన్నడూలేని రీతిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కగా, పెద్దఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు రూపొందించిన పశుసంరక్షక్‌ యాప్‌కు 2021–22లో స్కోచ్‌ సిల్వర్‌ అవార్డు దక్కింది.

గతేడాది బెస్ట్‌ స్టేట్‌ ఇన్‌ ఏహెచ్‌ మేనేజ్‌మెంట్‌ కేటగిరిలో ఇండియా యానిమల్‌ హెల్త్‌ అవార్డ్‌–2022 దక్కగా, యానిమల్‌ హెల్త్‌ లీడర్‌షిప్‌ అవార్డు–2022, కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నుంచి 2020లో అవార్డు ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ దక్కింది. 

సీఎం విజన్‌కు ఇది గుర్తింపు..
మా శాఖకు గతంలో ఎన్నడూ ఇంతలా గుర్తింపు లభించలేదు. ఇన్ని అవార్డులు కూడా దక్కలేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌తో గడిచిన 44 నెలల్లో ఎన్నో రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వాటి ద్వారా రైతులకు మరింత నాణ్యమైన సేవలు అందించగలుగుతున్నాం. ఒకే ఏడాది నాలుగు స్కోచ్‌ అవార్డులు దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్నా. – డాక్టర్‌ రెడ్నం అమరేంద్రకుమార్,  డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు