-

తండ్రి ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం జగన్‌

5 Oct, 2022 11:11 IST|Sakshi

చీకటి నిండిన బతుకుల్లో.. విరబూస్తున్న వెలుగుపూలు 

1998 డీఎస్సీ అభ్యర్థులకు కొత్త జీవితం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

14 తర్వాత టీచర్లుగా నియామకం

ఉమ్మడి జిల్లాలో 2,807 మందికి మేలు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వారి కష్టం ఎట్టకేలకు ఫలించింది. చదివిన చదువు వృథా పోలేదు. తమ బతుకులు ఇంతేనని నిరాశలో ఉన్న వారి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. 1998లో డీఎస్సీ రాయగా అది చెల్లదంటూ అందులో ఎంపికైన వారికి నాటి చంద్రబాబు ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. దీనిపై వారు 22 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. కోర్టుకు వెళ్లారు.
చదవండి: ‘అలా చేస్తే చూస్తూ ఊరుకుంటారా.. చంద్రబాబును తరిమి కొడతారు’

తమకు అన్యాయం జరిగిందంటూ నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కలిశారు. 1998 డీఎస్సీలో అర్హులైన అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. తర్వాత ఆయన హఠాన్మరణంతో ఆ ఫైల్‌ ఆగిపోయింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు వారి గోడును పట్టించుకోలేదు. విపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తూ జిల్లాకు వచ్చినప్పుడు డీఎస్సీ అభ్యర్థులు ఆయనను కలిశారు.

తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ ప్రభుత్వం రాగానే సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టాక ఆ మాట నిలబెట్టుకునే దిశగా చర్యలు చేపట్టారు. కోర్టు తీర్పు అనంతరం 1998 డీఎస్సీ అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించేందుకు అన్ని చర్యలూ పూర్తి చేశారు. ఫలితంగా తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని 1998 డీఎస్సీ అభ్యర్థులు 2,807 మంది ఉపాధ్యాయ ఉద్యోగాల్లో చేరనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఉత్తర్వులు అందాయి. అర్హులందరూ అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేసే పనిలో పడ్డారు. ఈ నెల ఆరు నుంచి 14వ తేదీలోగా వాటి వెరిఫికేషన్‌ పూర్తి కానుంది. అనంతరం అర్హులైన అందరినీ ఈ నెల 14వ తేదీ తర్వాత ఉపాధ్యాయులుగా నియమించనున్నారు.

6 నుంచి క్వాలిఫైడ్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
కాకినాడ సిటీ/రాయవరం: ఈ నెల 6, 7 తేదీల్లో డీఎస్సీ–1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి డి.సుభద్ర పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1998 డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూకు హాజరై పోస్టు పొందని అభ్యర్థులు 560 మంది ఉన్నారు. వీరిలో ఆసక్తి ఉన్న క్వాలిఫైడ్‌ అభ్యర్థులు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేసేందుకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారి ఒరిజనల్‌ సర్టిఫికెట్లను కాకినాడలోని పీఆర్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరిశీలించనున్నారు.

సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే వారు ఆధార్‌ కార్డు, డీఎస్సీ ఇంటర్వ్యూ లెటర్, మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, హాల్‌ టికెట్‌/ర్యాంకు కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఎస్‌ఎస్‌సీ/ఇంటర్‌/డిగ్రీ/పీజీ క్వాలిఫికేషన్‌ సర్టిఫికెట్లు, డీఈడీ/బీఈడీ ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్‌ సర్టిఫికెట్లు, స్టడీ/రెసిడెన్స్‌ సర్టిఫికెట్లు, ఏజెన్సీ ఏరియా సరి్టఫికెట్లు (వర్తిస్తే), పీహెచ్‌సీ సర్టిఫికెట్లు (అవసరమైన వారు), టీచింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ (అనుభవం ఉన్నవారు) తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలి.

వీరందరూ మూడు సెట్ల సెల్ఫ్‌ అటెస్టెడ్‌ కాపీలు కూడా అందజేయాలని డీఈఓ తెలిపారు. అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. హాల్‌ టికెట్‌ నంబర్‌ 4100047 నుంచి 4102488 వరకూ ఉన్న అభ్యర్థులు 6వ తేదీన, 4102489 నుంచి 4105490 వరకూ ఉన్న అభ్యర్థులు 7వ తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని డీఈఓ సుభద్ర సూచించారు. 

మరిన్ని వార్తలు