ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఆపన్నహస్తం 

15 Jul, 2022 03:32 IST|Sakshi
చింతూరు ముంపు ప్రాంతం నుంచి వృద్ధుడిని ఆస్పత్రికి తరలిస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా సహాయక చర్యలు 

సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధితులకు స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎస్డీఆర్‌ఎఫ్‌) బృందాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ప్రాణనష్టం లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాయి. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా 150 మంది సభ్యులతో కూడిన 5 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు కింద ఏడు ముంపు మండలాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతోపాటు ఏలూరు, అల్లూరి, కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నాయి.

అల్లూరి జిల్లాలోని కూనవరం, వీఆర్‌ పురం, రాజుపేట ఎస్సీ కాలనీ, ఏలూరు జిల్లాలోని సుడిగుమ్మరీపగుమ్మ, కోనసీమ జిల్లాలోని టేకుల సెట్టిపాలెం, వీరవల్లిపాలెం, కొట్టిలంక, గుంజరామేక తదితర గ్రామాల ప్రజలను గురువారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పోలవరం ముంపు మండలాల పరిధిలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే 30 మంది విద్యార్థులకు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు భద్రత కల్పించాయి. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఆహారం పంపిణీ చేశాయి.  

మరిన్ని వార్తలు