చెరువుల్లో సముద్ర చేపలు!

31 Mar, 2022 03:54 IST|Sakshi
గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెంలో చేపల చెరువుల్లోని పంజరాల్లో సముద్రచేపల సాగు

పంజరాలు కట్టి పెంచుతున్న వైనం

గుంటూరు జిల్లా రైతుల వినూత్న ఆలోచన

లాభాల బాటలో పండుగప్ప, చందువాపార సాగు

నిజాంపట్నంలో ఆక్వా పార్కు ఏర్పాటు

చెరువు తవ్వేందుకు 40 శాతం సబ్సిడీ ఇస్తూ.. ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం 

సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం రైతుల వినూత్న ఆలోచనతో.. ఆక్వా సాగు కొత్తపుంతలు తొక్కుతూ లాభాల బాటలో పయనిస్తున్నది. సహజంగా చెరువుల్లో సాధారణ రకాల చేపలు, రొయ్యలను సాగుచేస్తుంటారు. అయితే  సముద్రంలో లభించే అరుదైన పండుగప్ప(సీబాస్‌), చందువాపార(సిల్వర్‌ పాంపనో) రకం చేపలను చెరువుల్లో పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన పెదపులుగువారిపాలెం రైతులకు వచ్చిన నేపథ్యంలో.. పంజరం సాగు  ప్రచారంలోకి వచ్చింది. 

పంజరాల్లో చేపల పెంపకం ఇలా.. 
సముద్రంలో పెరిగే  పండుగప్ప, చందువాపార చేపలు సాధారణంగా వాటి కన్నా పరిమాణంలో చిన్న చేపలను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి.  దీనిని నివారించేందుకు పిల్లలను చెరువుల్లో వలలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంజరాల్లో సాగు చేస్తున్నారు. వారానికొకసారి చేపలను గ్రేడింగ్‌ చేసి బరువు ఆధారంగా వేర్వేరు పంజరాల్లో పెంచుతున్నారు. పంజరంలో పెరిగే క్రమంలో చిన్న వయసు నుంచే రైతులు వేసే మేతను తినే అలవాటు చేస్తారు. ఇలా 100 గ్రాములు బరువు వచ్చే వరకు పంజరంలో పెంచిన తర్వాత ఒకే పరిమాణంలో ఉన్న చేపలను చెరువుల్లోకి విడుదల చేస్తారు. రొయ్య, చేపల పెంపకంలో తరచూ నష్టాలు వస్తుండడంతో ప్రత్యామ్నాయంగా పంజరాల్లో సాగు ప్రారంభించామని పెదపులువారిపాలెం రైతులు చెబుతున్నారు. ఆర్టీసీఏ సహకారంతో ప్రయోగాత్మకంగా తొలుత మూడెకరాల్లో సాగు చేసిన పంజరం తరహాసాగు లాభదాయకంగా ఉండడంతో..  ప్రస్తుతం 33 ఎకరాల్లో సాగవుతోందని చెబుతున్నారు.

చెరువు వద్దే రూ.400 పైగా ధర.. 
పండుగప్ప, చందువాపార రకాలకు మన దేశంతో పాటు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంది.  ముఖ్యంగా మలేషియా, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక తదితర దేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంది. చెరువు వద్దే పండుగప్ప చేప కిలో రూ.400 పైగా ధర పలుకుతుంది. వీటిని ఉప్పు చేపగా తయారుచేసి కిలో రూ.800–850 దాకా విక్రయిస్తున్నారు. అలాగే చందువాపార రకం రైతు వద్ద కిలో రూ.350 దాకా లభిస్తోంది.  

‘ఆక్వా’ పార్కుతో మరింత ప్రోత్సాహం.. 
ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్న రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ ఆక్వా కల్చర్‌(ఆర్జీసీఏ), కొచ్చిన్‌లో ఉన్న సెంటర్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఎఫ్‌ఆర్‌ఐ) సముద్ర రకం చేపల సాగుకు పిల్లలను సరఫరా చేస్తున్నాయి. సముద్ర చేపల పెంపకాన్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిజాంపట్నంలో ఆక్వా పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. సుమారు 280 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఏర్పాటు చేయనున్న పార్కు డీపీఆర్‌  పూర్తవుతుంది.  

ప్రోత్సాహంతో పాటు శిక్షణ.. 
సముద్ర చేపలైన పండుగప్ప, చందువాపార రకం పెంచాలనుకునే రైతులకు అవసరమైన సాంకేతిక శిక్షణను ఆర్‌బీకేల ద్వారా అందించనున్నాం. చెరువుల తవ్వకానికి 40 శాతం దాకా సబ్సిడీ ఇవ్వనున్నాం. నాణ్యమైన, తక్కువ ధరలో చేప పిల్లలను అందు బాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  
 – డి. సురేష్, డీడీ, మత్స్యశాఖ, గుంటూరు జిల్లా 

మరిన్ని వార్తలు