పరిశ్రమలకు సముద్రపు నీరు

10 Oct, 2022 04:31 IST|Sakshi

పైడి భీమవరంలో రాష్ట్రంలో తొలి డీశాలినేషన్‌ ప్లాంట్‌ 

తొలిదశలో రూ.400 కోట్లతో రోజుకు 35 మిలియన్‌ లీటర్ల నీటిశుద్ధి.. ప్లాంట్‌ ఏర్పాటుకు టెండర్లు పిలిచిన ఏపీఐఐసీ

పైడి భీమవరం క్లస్టర్‌లో 26కుపైగా ఫార్మా, కెమికల్‌ కంపెనీలు

ప్రస్తుతం భూగర్భ జలాలను వినియోగిస్తున్న యూనిట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా సముద్రపు నీటిని శుద్ధిచేసి మంచినీటిగా మార్చే డీశాలినేషన్‌ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు సముద్రపు నీటిని శుద్ధిచేసి సరఫరా చేయడానికి రూ.400 కోట్లతో డీశాలినేషన్‌ ప్లాంట్‌ను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. పైడి భీమవరం ప్రాంతంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్, అరబిందో వంటి 26కుపైగా ఫార్మా, రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ పరిశ్రమలకు అవసరమైన నీటికోసం అత్యధికంగా భూగర్భజలాలపై ఆధారపడుతున్నారు.

తీరప్రాంతంలోని పరిశ్రమలకు సముద్రపు నీటిని శుద్ధిచేసి సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తొలి డీశాలినేషన్‌ ప్లాంట్‌ను పైడి భీమవరం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం మెంటాడ వద్ద సుమారు 50 ఎకరాల్లో దీన్ని నెలకొల్పనున్నారు. తొలిదశలో రోజుకు 35 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధిచేసే విధంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రానున్న కాలంలో దీన్ని వంద మిలియన్‌ లీటర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీఐఐసీ శ్రీకాకుళం జోనల్‌ మేనేజర్‌ యతిరాజులు తెలిపారు.

ఇక్కడ శుద్ధిచేసిన నీటిని పైప్‌లైన్ల ద్వారా పైడి భీమవరం పారిశ్రామికవాడ, దాని చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు అందించనున్నారు. దీనివల్ల భూగర్భ జలాల వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ యూనిట్‌లో భాగస్వామ్యం కోసం ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానిస్తోంది. బిల్డ్‌ ఓన్‌ ఆపరేట్‌ (బీవోవో), బిల్డ్‌ ఓన్‌ ఆపరేట్‌ ట్రాన్సఫర్‌ (బీవోవోటీ) విధానంలో ఆహ్వానిస్తున్న ఈ టెండర్లలో పాల్గొనడానికి ఈ నెల 13 చివరితేదీ.  

నాలుగుపైసలకే లీటరు నీరు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి అతిచౌకగా నీటిని అందించే డీశాలినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 2019 ఆగస్టులో ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ఉన్న హెచ్‌2ఐడీ డీశాలినేషన్‌ ప్లాంట్‌ను సందర్శించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఇజ్రాయిల్‌కు చెందిన కొంతమంది ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి డీశాలినేషన్‌లో ఐడీఈ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఖర్చు తక్కువ అవుతుందని తెలిపారు.

కేవలం నాలుగు పైసలకే లీటరు నీటిని ఉత్పత్తిచేసే అవకాశం డీశాలినేషన్‌లో ఉండటంతో తీరంలో పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్న పైడి భీమవరంలోని రసాయన పరిశ్రమలకు డీశాలినేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారాన్ని చూపిస్తోంది.   

మరిన్ని వార్తలు