నాలుగో రోజైనా జాడ దొరికేనా? 

9 Mar, 2023 04:50 IST|Sakshi

తల్లి పులి కోసం 300 మందితో అన్వేషణ 

నిలకడగా పులి పిల్లల ఆరోగ్యం

ఆత్మకూరు రూరల్‌/కొత్తపల్లి: శ్రీశైలం–నాగార్జున సాగర్‌ పులుల అభయారణ్యంలో 4 ఆడ పిల్లలను ఈనిన ‘టీ108’ అనే పెద్దపులి వాటికి దూరమై 3 రోజులు గడిచిపోయింది. మరో వైపు తల్లీ బిడ్డల పునరేకీకరణ (రీయూనియన్‌)కు అటవీ అధికారులు పూర్తిగా శ్రమిస్తున్నారు. 300 మంది ఎన్‌ఎస్‌టీఆర్‌ (నాగార్జున సాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌) సిబ్బంది, అధికారులు విడతల వారీగా పాద పరిశీలన (ఫుట్‌ పేట్రోలింగ్‌) చేస్తున్నారు.

పులుల ప్రవర్తనాంశాలను పరిశీలిస్తే తల్లి పులి తన పిల్లల కోసం గరిష్టంగా 4 రోజుల వరకు వెతికే యత్నం చేస్తుందని పులి జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు చెబుతున్నారు. అయితే ఇంకో 24 గంటలు గడిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక తల్లి పులి తన బిడ్డలను గుర్తించి అక్కున చేర్చుకోవడమన్నది అసాధ్యమంటున్నారు. తల్లి పులి జాడ దొరకని పక్షంలో పులి కూనలను జంతు ప్రదర్శన శాలకు తరలించే అవకాశం ఉంది.

కాగా, పులి కూనల ఆరోగ్యం నిలకడగా ఉందని ఎన్‌ఎస్‌టీఆర్‌ (నాగార్జున సాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌) డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అపావ్‌ చెప్పారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని చీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌ క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పులి కూనలు చక్కగా ఆహారం తీసుకుంటున్నాయని, కోడి కాలేయం ముక్కలను ఇష్టంగా భుజించాయని తెలిపారు.

300 మంది ఎన్‌ఎస్‌టీఆర్‌ సిబ్బంది, అధికారులు విడతల వారీగా పాద పరిశీలన (ఫుట్‌ పేట్రోలింగ్‌)లో ఉన్నట్లు వివరించారు. తల్లిని విడిచిన కూనలు కొంత షాక్‌లో ఉంటాయి కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించడం వాటికి ఇబ్బంది అయిన కారణంగా మొదట తల్లిని అన్వేషించి ఆ తరువాత పిల్లలను ఆ పులి వద్దకు చేర్చే వ్యూహాన్ని పాటిస్తున్నామన్నారు. స్నిప్పర్‌ డాగ్స్‌తో (శునక శోధన), డ్రోన్‌ కెమెరాలతో పులిని గుర్తించే యత్నం చేయడం లేదని, అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని చెప్పారు. 

ఆ పాదముద్ర తల్లి పులిదేనా?
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ముసలిమడుగు, చిన్నగుమ్మడాపురం గ్రామాల మధ్యన ప్రధాన రహదారికి కొద్ది దూరంలో ఆటోడ్రైవర్‌కు పెద్దపులి బుధవారం కనిపించింది. ఈ విషయాన్ని అక్కడే ఉన్న గొర్రెల కాపరి చిన్న వెంకటేశ్వర్లుకు అతడు తెలపగా..అతను చూసేలోపు పులి అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులి కాలిముద్రలను పరిశీలించారు.

అచ్చిరెడ్డికుంట వరకు పెద్దపులి కాలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడినుంచి పులి ఎటువైపుగా వెళ్లిందనే కోణంలో గాలింపునకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఈ పులి పాదముద్రలను ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో అచ్చు తీసి టీ108 తో సరిపోల్చి నిర్థారించగలిగితే తల్లిని అన్వేషించే పనిలో కొంత పురోభివృధ్ధి సాధించినట్లేనని శ్రీశైలం అటవీ శాఖ ఫీల్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరు డీఎఫ్‌వో అలెన్‌చాంగ్‌టేరాన్‌ తెలిపారు. 
 

మరిన్ని వార్తలు