డబ్బు.. మద్యం పంపిణీకి చెక్‌ పెట్టేలా..

31 Jan, 2021 03:33 IST|Sakshi

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రంగంలోకి ఎస్‌ఈబీ టాస్క్ ఫోర్స్‌ టీమ్‌లు 

రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌లు 

సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు మరింత పటిష్టం 

సాక్షి, అమరావతి:  పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహానికి చెక్‌ పెట్టేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) రంగంలోకి దిగింది. డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్, ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణ మొదలైంది. రాష్ట్రంలోని 18 పోలీస్‌ యూనిట్ల పరిధిలో.. ఏఎస్పీల నేతృత్వంలో ఎస్‌ఈబీ టీమ్‌లు డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తాయి. పోలీస్, ఎక్సైజ్, మైనింగ్‌ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ స్పెషల్‌ టీమ్‌లు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. రాష్ట్ర స్థాయిలోను, 18 పోలీస్‌ యూనిట్ల పరిధిలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి కంట్రోల్‌ రూమ్‌లో సీఐ నేతృత్వంలో ఒక ఎస్సై, సిబ్బంది విధులు నిర్వహిస్తారు. డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు కంట్రోల్‌ రూమ్‌లకు తెలియజేయవచ్చు.  

ఈసీఎంఎస్‌ యాప్‌తో పర్యవేక్షణ
డబ్బు, మద్యం పంపిణీ.. వాటి రవాణాకు సంబంధించిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ చేపట్టేందుకు ప్రత్యేకంగా ఎక్సైజ్‌ కంప్లైంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఈసీఎంఎస్‌) యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఆన్‌లైన్‌ సిస్టమ్, వాట్సాప్, కంట్రోల్‌ రూమ్‌ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఫిర్యాదులపై ఎంతవరకు చర్యలు తీసుకున్నారు, చర్యలు తీసుకోకపోతే కారణాలేమిటి, దాడులు చేసిన ఫలితాలు తదితర అన్ని వివరాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. వీటిపై ప్రతిరోజూ ఉదయం రాష్ట్రస్థాయి అధికారులతో మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోను, జిల్లాల స్థాయిలోను వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాల ఎస్‌ఈబీ టీమ్‌లతో టెలీ కాన్ఫరెన్స్‌లో తక్షణ ఆదేశాలిస్తున్నారు. 

రంగంలోకి టాస్‌్కఫోర్స్‌ టీమ్‌లు 
మద్యం, డబ్బు రవాణా, పంపిణీలకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్‌ఈబీ నేతృత్వంలో ప్రత్యేకంగా 12 టాస్‌్కఫోర్స్‌ టీమ్‌లను, ప్రతి జిల్లాలో 10 చొప్పున 180 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఎస్‌ఈబీ ప్రత్యేకంగా 130 మొబైల్‌ పార్టీలతోపాటు పోలీస్, మైనింగ్, ఎక్సైజ్‌ శాఖలకు చెందిన బృందాలు కూడా ఉంటాయి. మద్యం, డబ్బు రవాణా, పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పుటికప్పుడు ఎస్‌ఈబీకి చేరవేసేలా ఇంటెలిజెన్స్‌(నిఘా) బృందాలు కూడా పనిచేస్తున్నాయి. 

439 చెక్‌పోస్టులు 
పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి మద్యం, డబ్బు రవాణా కాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితోపాటు జిల్లాలు డివిజన్ల వారీగా కూడా చెక్‌పోస్టులు పెట్టారు. ఎస్‌ఈబీ ప్రత్యేకంగా 50 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయగా, మైనింగ్, ఎక్సైజ్, పోలీస్‌ శాఖలకు చెందిన మరో 389 చెక్‌పోస్టులు ఉన్నాయి. మొత్తం 439 చెక్‌పోస్టులు ఈ ఎన్నికల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పనిచేస్తున్న స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్లు(ఎస్‌పీవోలు) 2,200 మందితోపాటు ఎస్‌ఈబీ అధికారులు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఈ చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. 

ఒక్క రోజే 219 కేసులు 
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. నామినేషన్లు మొదలైన శుక్రవారం ఒక్క రోజే ఎస్‌ఈబీ 219 కేసులు నమోదు చేసి 219 మందిని అరెస్ట్‌ చేసింది. 35 వాహనాలను స్వా«దీనం చేసుకున్నాం. డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్, ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో రాష్ట్రంలో ఎస్‌ఈబీ, పోలీస్, ఎక్సైజ్, మైనింగ్‌ సమన్వయంతో మంచి ఫలితాలు సాధించే దిశగా చర్యలు చేపట్టారు.  
    – పీహెచ్‌డీ రామకృష్ణ, ఎస్‌ఈబీ డైరెక్టర్‌   

మరిన్ని వార్తలు