‘కంట్రోల్‌ రూమ్‌’ కనుసన్నల్లో నిమ్మగడ్డ యాప్‌!

1 Feb, 2021 04:39 IST|Sakshi

టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ నియంత్రణలోనే యాప్‌ నిర్వహణ!

ఫిర్యాదుల కోసం వాట్సాప్‌ నంబర్‌ కేటాయించిన టీడీపీ కార్యాలయం

ఆ ఫిర్యాదులను వేర్వేరు నంబర్ల నుంచి నిమ్మగడ్డ యాప్‌కు పంపేలా ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధమైన పదవిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న వికృత క్రీడ పరాకాష్టకు చేరుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఎన్నికల ప్రక్రియను ఛిన్నాభిన్నం చేసి అధికారులను గందరగోళానికి గురి చేసేందుకు టెక్నాలజీ చాటున ఎత్తుగడలకు దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న యాప్‌ ద్వారా ఎంపిక చేసుకున్న ఫిర్యాదులు మాత్రమే స్వీకరించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఈ యాప్‌ను అత్యంత గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలు తమ పార్టీ కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదులు పంపడం.. వాటిని నిమ్మగడ్డ యాప్‌కు చేరవేయడం.. అక్కడి నుంచి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను ఛిన్నాభిన్నం చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తద్వారా అధికార వైఎస్సార్‌ సీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని బురద చల్లేందుకు ప్రయత్నం జరుగుతోంది. ప్రజల ఓట్లతో గెలవడం అసాధ్యమని గత సార్వత్రిక ఎన్నికలు రుజువు చేయడంతో దొడ్డి దారి వ్యూహాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పదును పెడుతున్నట్లు వెల్లడవుతోంది.

మార్ఫింగ్‌ అవకాశాలు పుష్కలం
నిమ్మగడ్డ సొంతంగా రూపొందించుకున్న ప్రైవేట్‌ యాప్‌లో ఫిర్యాదులను మార్ఫింగ్‌ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీడియోలను ఎడిటింగ్‌ చేసి రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అవకాశమూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్, వెబ్‌కాస్టింగ్, నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ద్వారా ఇలాంటి వాటికి ఏమాత్రంఅవకాశం లేదు. అందుకనే వాటిని పక్కనపెట్టి నిమ్మగడ్డ ఓ ప్రైవేట్‌ యాప్‌ తెచ్చారు. దీనివల్ల తమకు అవసరమైన చోట మార్ఫింగ్‌ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లైవ్‌ టెలికాస్టింగ్‌ జరిగే వెబ్‌కాస్టింగ్‌లో వీటికి తావుండదు.

ఫిర్యాదులకు టీడీపీ వాట్సాప్‌ నంబర్‌ 
ఈ యాప్‌ పూర్తి వివరాలను ఎస్‌ఈసీ ఇంతవరకు వెల్లడించలేదు. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ‘యాప్‌’ ఆపరేషన్‌ మొదలు కావడం గమనార్హం. ప్రైవేటు వ్యక్తుల పరిధిలో ఉన్న ఆ యాప్‌ను టీడీపీ కార్యాలయంలోని ‘కంట్రోల్‌ రూం’ నుంచి నియంత్రించేలా కార్యాచరణకు ఉపక్రమించారు. ఎన్నికల ప్రక్రియపై కంట్రోల్‌ రూమ్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయాలని సూచిస్తూ ఫొటోలు, వీడియోలు పంపేందుకు ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్‌ను కేటాయిస్తూ టీడీపీ తన శ్రేణులకు సమాచారం ఇవ్వడం గమనార్హం. ఈ యాప్‌ వివరాలు, ఇతర సమాచారాన్ని వెల్లడించకుండానే టీడీపీ ఫిర్యాదుల కోసం సొంత ఏర్పాట్లు చేసుకోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు తప్పుడు ఫిర్యాదులు, మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు, ఎడిట్‌ చేసిన వీడియోలను ఆ వాట్సాప్‌ నంబర్‌కు పంపాలన్నది టీడీపీ తమ పార్టీ శ్రేణులకు పరోక్షంగా సూచించింది. తమ పార్టీ కార్యకర్తలు పంపించే తప్పుడు ఫిర్యాదులను టీడీపీ కార్యాలయంలోని కంట్రోల్‌ రూం నుంచి నేరుగా ఎన్నికల కమిషన్‌ యాప్‌కు పంపడం... వీటి ఆధారంగా నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని టీడీపీకి రాజకీయ ప్రయోజనం కల్పించాలన్నది అసలు పన్నాగమని నిపుణులు పేర్కొంటున్నారు.

గోప్యంగా సొంత ‘యాప్‌’...
పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు తాను ప్రత్యేకంగా ఓ యాప్‌ను ప్రవేశపెడతానని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ ఇటీవల ప్రకటించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల పర్యవేక్షణకు వినియోగిస్తున్న పారదర్శకమైన వెబ్‌ కాస్టింగ్‌ విధానాన్ని కాదని ఆయన సొంత యాప్‌ను తెస్తానని చెప్పడం పట్ల నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ యాప్‌ను ఎవరు రూపొందించారు? యాప్‌ పర్యవేక్షణ, ఎవరి నియంత్రణలో ఉంటుంది? తదితర వివరాలను ఆయన ఏమాత్రం వెల్లడించ లేదు. ఇదంతా టీడీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలోనే సాగుతోందని ఎన్నికల కమిషన్‌ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్న వారికిగానీ, సాధారణ ప్రజలకు గానీ ఇంతవరకు యాప్‌ వివరాలను వెల్లడించ లేదు. 

నిమ్మగడ్డ యాప్‌ కంట్రోల్‌ కేంద్రం ఎక్కడ?
కేంద్ర ఎన్నికల సంఘం 2019 సార్వత్రిక ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్‌తోపాటు ‘సీ–విజిల్‌’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా అమలు చేసింది. ఎన్నికల నిబంధనల అమలును దీని ద్వారా పర్యవేక్షించింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. అంతర్జాతీయంగా కూడా భారత్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రశంసలు వచ్చాయి. పారదర్శకంగా ఉండే ఈ యాప్‌ అందుబాటులో ఉండగా ఎక్కడ తయారైందో తెలియని సొంత యాప్‌ను నిమ్మగడ్డ తేవడంపై సందేహాలు అలముకుంటున్నాయి. అసలు నిమ్మగడ్డ యాప్‌ ఎక్కడ తయారైంది? ఎవరు పర్యవేక్షిస్తారు? కంట్రోల్‌ కేంద్రం ఎక్కడ? సిబ్బంది ఎవరు? కార్యాలయం ఎక్కడుంది? ఫిర్యాదులను ఎవరు చూస్తారు? టెండర్లు పిలిచారా? అనే వివరాలను  ఏమాత్రం వెల్లడించకుండా గుట్టుగా ప్రైవేట్‌ యాప్‌ను సిద్ధం చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ యాప్‌ పర్యవేక్షణ కేంద్రం ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో లేదన్నది మాత్రం సుస్పష్టం. 

ఇలా ఫిర్యాదు... అలా చర్యలు!
యాప్‌ నియంత్రణ ఎక్కడుందనే వివరాలను అధికార వర్గాలకు తెలియకుండా నిమ్మగడ్డ రహస్యంగా ఉంచారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ‘కంట్రోల్‌ రూం’ లోగుట్టు దాగుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. యాప్‌ ప్రవేశపెడుతున్నట్టు  అధికారికంగా వెల్లడించగానే అసలు కథ మొదలవుతుంది. అప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి తెప్పించిన ఫొటోలు, వీడియోలను యాప్‌లో అనుసంధానిస్తారు. యాప్‌ నిర్వహణ టీడీపీ ఐటీ వింగ్‌ ఆధ్వర్యంలోనే ఉండటంతో వాటినే కంట్రోల్‌ రూం నుంచి స్వీకరించి నిమ్మగడ్డకు అందజేస్తారు. ఇతరులు చేసే ఫిర్యాదులు బుట్టదాఖలు కానున్నాయి. టీడీపీ మద్దతుదారులు ఓడిపోతారని నిర్ధారణ అయ్యే పంచాయతీల్లో పోలింగ్‌ను నిలిపేయడం, ఓట్ల లెక్కింపును వాయిదా వేయడం, పోలింగ్‌ రద్దు చేయడం లాంటి చర్యలకు దిగే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు