ఏపీ: రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం

2 Apr, 2021 13:24 IST|Sakshi

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చ

ఫిర్యాదుల స్వీకరణకు ఎస్‌ఈసీ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్

ఎన్నికలు ఆలస్యమైతే వ్యాక్సినేషన్‌పై ప్రభావం: ఎస్‌ఈసీ నీలం సాహ్ని

సాక్షి, విజయవాడ: రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని శుక్రవారం సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్‌ఈసీ తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలు, ప్రచార నిబంధనలపై పార్టీలకు సూచనలిచ్చారు. సమావేశానికి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలీ, సీపీఎం నేత వైవీరావు హాజరయ్యారు. సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన హాజరుకాలేదు.

ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించలేదు: ఎస్‌ఈసీ
సమావేశం అనంతరం ఎస్‌ఈసీ నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణపై నిన్న నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. నేడు నిర్వహించిన సమావేశంలో పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్నందున ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరిందని తెలిపారు. గతేడాది మార్చిలో నిలిచిపోయిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 8న పోలింగ్‌, 9న రిజర్వ్‌డే, 10న కౌంటింగ్‌ నిర్వహిస్తామని ఎస్‌ఈసీ వెల్లడించారు.

నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మధ్యలో ఉందని.. గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తైందని పేర్కొన్నారు. ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించలేదన్నారు. కోర్టుల నుంచి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయకూడదని ఎక్కడా అభ్యంతరాలు లేవని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు ఎస్‌ఈసీ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పార్టీలను కోరామని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ఎన్నికలు ఆలస్యమైతే వ్యాక్సినేషన్‌పై ప్రభావం పడుతుందని ఎస్‌ఈసీ నీలం సాహ్ని తెలిపారు.

బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది: లేళ్ల అప్పిరెడ్డి
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, పరిషత్ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని ఎస్‌ఈసీకి చెప్పామని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షానికి కావాల్సిన వ్యక్తి పదవిలో లేనప్పుడు సమావేశానికి హాజరుకారా? అని ఆయన ప్రశ్నించారు. సమావేశాన్ని బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగబోతున్నాయి. తమకు ఎన్నికలు ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యమని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

ఎన్నికల నిర్వహణపై గిరిజాశంకర్‌ సమీక్ష
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ సమీక్ష నిర్వహించారు. అన్ని జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, జిల్లా ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై మార్గదర్శకాలను వివరించారు.


చదవండి:
ఆగిన చోట నుంచే ఆరంభం: ఎస్‌ఈసీ నీలం సాహ్ని
పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్..

మరిన్ని వార్తలు