ఏకగ్రీవాలు సర్పంచ్‌లకు ఎందుకు?

5 Feb, 2021 03:43 IST|Sakshi
నెల్లూరు జిల్లా అధికారులతో సమీక్షిస్తున్న నిమ్మగడ్డ

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై సమీక్షిస్తున్నాం.. త్వరలో వీటిపై నిర్ణయం తీసుకుంటాం

నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పర్యటనలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యాఖ్యలు  

సాక్షి, నెల్లూరు‌: ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏకగ్రీవాలు లేనప్పుడు సర్పంచ్‌ పదవులకు మాత్రం ఎందుకని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఏకగ్రీవాలు అధికంగా అయితే అధికార వైఫల్యం కిందకు వస్తుందన్నారు. అధిక ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదన్నారు. గురువారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎస్‌ఈసీ పర్యటించారు. పంచాయతీ ఎన్నికలపై ఆయా జిల్లాల అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కోవిడ్‌–19 అదుపులో ఉందని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ఇబ్బందులు లేవని చెప్పారు. ఎన్నికలను నిజాయితీగా, నిబద్ధతతో నిర్వహించేలా ఉద్యోగులందరూ పని చేయాలన్నారు. గతంలో ఏకగ్రీవాలు 20 శాతం ఉంటే ప్రస్తుతం పది శాతానికి పడిపోయినట్టు చెప్పారు.

రాజ్యాంగం నిర్దేశించిన విధంగా సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బాధ్యతన్నారు. శాంతిభద్రతలు కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా అధికారులు చూడాలన్నారు. కొత్త యాప్‌ ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో జరిగే లోపాలను మీడియా కూడా ప్రజలకు తెలియచేయాలన్నారు. మీడియాతో కలసి ఎన్నికల కమిషన్‌ పని చేస్తుందన్నారు. గత ఏడాది మార్చిలో ఏకగ్రీవమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీలను సమీక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒంగోలు సమావేశంలో పాత్రికేయులు ప్రశ్నలు అడుగుతున్నా సమాధానం చెప్పకుండానే ఎస్‌ఈసీ వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు