మాకు విశేషాధికారాలున్నాయి

8 Mar, 2021 03:27 IST|Sakshi

న్యాయమైన ఏకగ్రీవాలను తేల్చేందుకే విచారణ 

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నిమ్మగడ్డ 657 పేజీల కౌంటర్‌

కృష్ణా, గుంటూరు, విశాఖ, చిత్తూరు కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఆదేశాలు

సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు విశేషాధికారాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల వాయిదా, రద్దు, తిరిగి నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారాలున్నాయన్నారు. పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. భారత ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కూ ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతుంటే జోక్యం చేసుకుని నిష్పాక్షికంగా నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ సందర్భంగా 126 జెడ్పీటీసీలు, 2,363 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని, గతంతో పోలిస్తే ఏకగ్రీవాల సంఖ్య అసాధారణంగా పెరిగిందన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో బెదిరింపులు, ప్రలోభాలపై కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయని, అందుకే ఏకగ్రీవాల్లో ఎన్ని న్యాయమైనవో తేల్చేందుకే విచారణ జరపాలని నిర్ణయించామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని రిట్‌ పిటిషన్లను కొట్టివేయాలని, మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని అభ్యర్థించారు. 

ఫాం – 10 ప్రస్తావన లేకుండా కౌంటర్‌  
657 పేజీల కౌంటర్‌లో న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన దాదాపు 25 తీర్పులను నిమ్మగడ్డ ప్రస్తావించారు. పిటిషనర్లు ప్రధానంగా ప్రస్తావించిన ఫాం – 10 (అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఇచ్చే పత్రం) గురించి కనీసం ఒక్క పదం కూడా ఆయన కౌంటర్‌లో పేర్కొనకపోవడం గమనార్హం. కౌంటర్‌లో మొత్తం ఎన్నికల కమిషన్‌ అధికారాల గురించే ప్రస్తావించారు. 

డబ్బు, మద్యం పంపిణీపై నిఘా
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తయిందా లేదా అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆరా తీశారు. విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఆయా నగర పాలక సంస్థల కమిషనర్లతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనున్న నేపథ్యంలో డబ్బు, మద్యం పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీసుల సహకారంతో అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

నిమ్మగడ్డతో సీఎస్‌ భేటీ..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో సమావేశమయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్ల గురించి ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది.

పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై నివేదిక
పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీల వారీగా కౌంటింగ్, రీ కౌంటింగ్‌ జరిగిన తీరుపై పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఆదివారం ఎస్‌ఈసీకి నివేదిక అందజేసినట్టు తెలిసింది. కౌంటింగ్‌ తీరుపై ఎస్‌ఈసీ నివేదిక కోరిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు