కోరం లేకపోయినా.. ఎంపీపీ ఎన్నిక

6 Oct, 2021 05:22 IST|Sakshi

వాయిదా పడినచోట ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నికపై ఎస్‌ఈసీ స్పష్టత 

21 మండలాల్లో 8 ఎంపీపీ, 20 ఉపాధ్యక్ష పదవులకు 8న ఎన్నికలు 

సాక్షి, అమరావతి:  రెండుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదా పడిన మండలాల్లో ఈ నెల 8వ తేదీన నిర్ణీత కోరం లేకపోయినా ఆ ఎన్నికలను యథావిధిగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. గత నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఎక్కడైనా ఎన్నిక జరగకపోతే ఆ మరుసటి రోజు 25వ తేదీన ఎన్నిక నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రంలో 21 మండలాల్లో 8 ఎంపీపీ పదవులకు, 20 మండలాల్లో ఉపాధ్యక్ష, 6 చోట్ల కో–అప్టెడ్‌ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. ఆయా మండలాల్లో ఎన్నిక వాయిదా పడ్ద పదవులకు తిరిగి ఈ నెల 8న ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి కోరం నిబంధనలపై జిల్లా అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. 

మొదట ఎంపీపీ.. ఆ తరువాతే ఉపాధ్యక్ష ఎన్నికలు 
► ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో 8వ తేదీన  నిర్ణీత కోరం లేకపోయినా నిబంధనల ప్రకారం ఎన్నికను యథావిధిగా జరుపుకోవచ్చు. అయితే ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నిక రెండూ నిర్వహించాల్సిన చోట మొదట ఎంపీపీ ఎన్నిక పూర్తయిన తర్వాత ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించుకోవాలి. 

► ఆరు మండలాల్లో  కో–అప్టెడ్‌ సభ్యుల ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. ఈ ఎన్నికకు మాత్రం తప్పనిసరిగా కోరం ఉండాలి. 8వ తేదీన నిర్ణీత కోరం లేక కో–అప్టెడ్‌ సభ్యుని ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేకపోతే.. అదే మండలంలో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నిక కూడా జరగాల్సి ఉంటే ఆ మండలాల్లో 9వ తేదీన కోరంతో సంబంధం లేకుండా ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక జరుపుకోవచ్చు. 

► ఒకవేళ 8వ తేదీ కో–అప్టెడ్‌ సభ్యుని ఎన్నిక జరగాల్సిన మండలాల్లో ఆ పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోయినా, లేదంటే నామినేషన్లు దాఖలు చేసిన వారందరూ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నా, ఆ కో–అప్టెడ్‌ సభ్యుని ఎన్నికను పక్కనపెట్టి ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికను కోరంతో సంబంధం లేకుండా జరుపుకోవచ్చు.   

మరిన్ని వార్తలు