MPTC, ZPTC Elections: కౌంట్‌డౌన్‌!

17 Sep, 2021 02:33 IST|Sakshi

ఎంపీటీసీ, జెడ్పీటీసీలపై నేడు కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ 

కౌంటింగ్‌ నిర్వహణ ఏర్పాట్లపై చర్చ

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శుక్రవారం కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ తదితరులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీనే ఎన్నికలు జరిగినప్పటికీ న్యాయ వివాదాలతో కౌంటింగ్‌ ప్రక్రియ వాయిదా పడింది. దాదాపు ఆరు నెలల అనంతరం గురువారం ఉదయం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించేందుకు అనుమతించడంతో 19వ తేదీన కౌంటింగ్‌ జరపనున్నట్టు ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం 
వరుసగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అయింది. నోటిఫికేషన్‌ జారీ అయి ఇప్పటికి ఏడాదిన్నర దాటిపోయింది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం 2020 మార్చి 21వ తేదీన ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించి అదే ఏడాది మార్చి 24న కౌంటింగ్‌ పూర్తి చేయాలి. కానీ నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిపోయి అభ్యర్ధుల తుది జాబితా ఖరారైన తర్వాత అప్పటి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కరోనా పేరుతో మార్చి 15వ తేదీన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించిన సమయంలో అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే పరిషత్‌ ఎన్నికలు జరపకుండా కాలయాపన చేశారనే విమర్శలున్నాయి. అనంతరం నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటవ తేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసి 8వ తేదీన ఓటింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు.   

మరిన్ని వార్తలు