రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు! 

10 Mar, 2023 07:58 IST|Sakshi

వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు

వివేకా చెక్‌ పవర్‌ రద్దు చేసిన కుమార్తె, అల్లుడు

చంద్రబాబు, బీటెక్‌ రవి ప్రభావానికి లోనయ్యే సునీత నాపై అసత్య ఆరోపణలు

దస్తగిరి మాటల ఆధారంగా ఏకపక్షంగా సీబీఐ దర్యాప్తు

పిటిషన్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించిన ఎంపీ అవినాశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం  విచారణకు హాజరు కావాలనడంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్‌లో ఆయన కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. 

వివేకా, సునీత మధ్య మనస్పర్థలు 
‘2010లో షేక్‌ షమీమ్‌ను వైఎస్‌ వివేకా రెండో వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. అప్పటి నుంచి వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. షమీమ్‌ను సునీత, ఆమె భర్త ఎన్‌.రాజశేఖరరెడ్డి, బావ ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డి శత్రువుగా చూసేవారు. సునీత, రాజశేఖరరెడ్డితో పాటు వివేకా పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. వారు వివేకానందరెడ్డి చెక్‌ పవర్‌ను కూడా రద్దు చేశారు. దీంతో ఆయన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివేకా మొదటి భార్య, కూతురు హైదరాబాద్‌లో ఉండగా, ఆయన మాత్రం పులివెందులలోనే ఎక్కువ రోజులు గడిపేవారు. 

ఒక దశలో ఆయన వారసుడిగా షమీమ్‌ కుమారుడినే ప్రకటిస్తారని, ఆ మేరకు విల్లు కూడా రాశారని పుకార్లు వచ్చాయి. హత్య అనంతరం నిందితుల (ఏ1 నుంచి ఏ4) ఇళ్లలో ఈ పత్రాల కోసం వెతికినట్లు కూడా సమాచారం. ఇవన్నీ పరిశీలిస్తే.. సొంత కుటుంబ సభ్యులే ఆయన్ని వదలించుకునే పథకం వేసినట్లు అర్థమవుతుంది. వివేకా మరణానంతరం సునీత, ఆమె కుటుంబీకులు బెదిరించినట్లు షమీమ్‌ దర్యాప్తు అధికారులకు కూడా చెప్పారు. తన కుమారుడి పేరుమీద రూ.2 కోట్లు బ్యాంక్‌లో డిపాజిట్‌ చేస్తానని వివేకా చెప్పినట్లు వెల్లడించారు’ అని అవినాశ్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. 

బీటెక్‌ రవి, చంద్రబాబు ప్రభావంతోనే..  
‘వివేకా హత్య తర్వాత సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)ని కలిశారు. రవి ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో మంతనాలు జరిపారు. హత్య జరిగిన సంవత్సరం వరకు సునీత నాపై ఆరోపణలు చేయలేదు. పైగా, ప్రెస్‌మీట్‌ పెట్టి నా విజయం కోసం వివేకా చాలా శ్రమించారని, జమ్మలమడుగులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని ఆమె చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభావానికి లోనైన తర్వాతే నాపై ఆరోపణలు చేశారు’ అని తెలిపారు.

వారికి నచ్చినట్లు దర్యాప్తు 
‘దస్తగిరి అక్కడా ఇక్కడా విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు. సునీల్‌ యాదవ్‌ గూగుల్‌ టేక్‌ఔట్‌ ఫోన్‌ లొకేషన్‌ అనే పేరుతో సీబీఐ నన్ను వేధిస్తోంది. హత్య జరిగిన ప్రాంతంలో దొరి­కిన లేఖపై దర్యాప్తు చేయటంలేదు. ద­ర్యాప్తు అధికారి తప్పుడు ప్రచారానికి ప్ర­భావితమై ఆ కోణంలోనే, పక్షపాతంతో విచారణ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు చె­ప్పేలా కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు. నేను విచారణలో చెప్పిన విషయాలను విచారణ అధికారి మార్చి వారికి అవసరమైనట్లుగా మీడియాకు లీకులిస్తున్నారు. నోటీసుల దశలో దర్యాప్తు సాగుతుండగా చార్జిషీట్‌లో నేరస్తునిగా సీబీఐ చిత్రీకరిస్తోంది. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు. అందువల్ల నిష్పక్షపాతంగా విచా­రణ జరిగేలా దర్యాప్తు అధికారులను ఆదేశించాలి’ అని అవినాశ్‌రెడ్డి పిటిషన్‌లో కోరా­రు.  

మరిన్ని వార్తలు