కృష్ణమ్మ ఉగ్రరూపం..ఈ సీజన్‌లో ఇది రెండో గరిష్ట వరద

15 Oct, 2022 08:51 IST|Sakshi

శ్రీశైలం ప్రాజెక్టు పదిగేట్లు ఎత్తివేత

సాగర్, పులిచింతలలోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 2.90 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి

నేడు ప్రకాశం బ్యారేజ్‌లోకి 4 లక్షల నుంచి 4.30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం

పెన్నాలో మరింత పెరిగిన వరద

సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్టు/మాచర్ల: పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ఉపనదుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,95,652 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో పదిగేట్లను 15 అడుగులు ఎత్తి 3,77,160 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 65,534 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడ్‌ హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 141 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.5 అడుగుల్లో 212.91 టీఎంసీలు నిల్వచేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, విద్యుత్‌కేంద్రాల నుంచి దిగువకు వదిలేస్తున్న జలాల్లో నాగార్జునసాగర్‌లోకి 4,25,400 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో స్పిల్‌వే 20 గేట్లు, విద్యుత్‌కేంద్రాల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 589.7 అడుగుల్లో 311.15 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. 

ప్రకాశం బ్యారేజ్‌లోకి పెరుగుతున్న వరద
పులిచింతల ప్రాజెక్టులోకి 3,90,904 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో వరద నియంత్రణలో భాగంగా పులిచింతల ప్రాజెక్టును కొంతభాగం ఖాళీ చేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుత్‌కేంద్రం ద్వారా 4,34,066 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి వచ్చే వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,96,561 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు ఆరువేల క్యూసెక్కులు విడుదల చేస్తూ 2.90 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

పులిచింతల నుంచి భారీగా విడుదల చేసిన వరదలో 4 లక్షల నుంచి 4.30 లక్షల క్యూసెక్కులు శనివారం ప్రకాశం బ్యారేజ్‌కి చేరుకునే అవకాశం ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి వచ్చిన వరదను వచ్చినట్లు 1.84 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి తుంగభద్ర, వేదవతి, బీమా, హంద్రీ వరద తోడవనుండటంతో శనివారం కూడా ఇదేరీతిలో శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి కొనసాగనుంది.

అప్పర్‌ పెన్నార్‌ నుంచి నెల్లూరు బ్యారేజ్‌ దాకా..
కర్ణాటక, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నాలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. దీంతో అప్పర్‌ పెన్నార్‌ నుంచి ప్రాజెక్టు నుంచి నెల్లూరు బ్యారేజ్‌ వరకు అన్నింటి గేట్లను ఎత్తేశారు. అనంతపురం జిల్లాలోని చాగల్లు రిజర్వాయర్‌ నుంచి 32 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో వైఎస్సార్‌ జిల్లాలోని గండికోట, మైలవరం జలాశయాల్లోకి వరద ఉద్ధృతి పెరిగింది. గండికోట, మైలవరం నిండుకుండలను తలపిస్తున్నాయి.

మైలవరం జలాశయం నుంచి 41,392 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో సోమశిలలోకి వరద ఉద్ధృతి పెరిగింది. సోమశిలలోకి 31,260 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇక్కడ 68.39 టీఎంసీలను నిల్వచేస్తూ.. స్పిల్‌వే, విద్యుత్‌కేంద్రం ద్వారా 27,998 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు సంగం బ్యారేజ్‌ మీదుగా నెల్లూరు బ్యారేజ్‌కు చేరుతున్నాయి. నెల్లూరు బ్యారేజ్‌లో మిగులుగా ఉన్న 16 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు