చురుగ్గా భూ సర్వే

8 Dec, 2021 03:18 IST|Sakshi

రెండో దశలో 650 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తికి సన్నాహాలు

డ్రోన్‌ ఫొటోలతో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ 

జనవరికల్లా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు

సాక్షి, అమరావతి: రెండో దశ సమగ్ర భూ రీ సర్వే (వైఎస్సార్‌ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు) పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 650 గ్రామాల్లో వచ్చే జనవరికల్లా రీ సర్వేను పూర్తి చేసే లక్ష్యంతో సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖాధికారులు పనిచేస్తున్నారు. 646 గ్రామాల డ్రోన్‌ చిత్రాలు ఇప్పటికే అధికారులకు అందాయి. వాటి ద్వారా సర్వే కొనసాగిస్తున్నారు. 92 గ్రామాల్లో ఇప్పటికే రీ సర్వే చివరి దశకు చేరుకొంది. వీటికి కొత్త సరిహద్దులు నిర్ణయిస్తూ ఇచ్చే 13 నోటిఫికేషన్లు త్వరలో జారీ చేయనున్నారు. ఈ గ్రామాల తుది భూ రికార్డులను తయారు చేస్తున్నారు.

44 గ్రామాల్లో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 140 గ్రామాల్లో భూముల పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌ తదితరాల పరిశీలన జరుగుతోంది. 439 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ (క్షేత్ర స్థాయి నిజనిర్థారణ) జరుగుతోంది. డ్రోన్‌ చిత్రాల ఆధారంగా కొత్తగా తయారు చేసిన సరిహద్దులతో ఆ సర్వే నెంబర్ల భూమిని భూ యజమానుల సమక్షంలో కొలతలు వేస్తారు. గ్రామాల్లోని సచివాలయ సర్వేయర్లతో ఈ పని చేయిస్తున్నారు. మరో నాలుగు గ్రామాల డ్రోన్‌ చిత్రాలు త్వరలో అందనున్నాయి. ఇవికాకుండా 5,500 గ్రామాల్లో అడంగల్, ఆర్‌ఎస్‌ఆర్‌తో సరిదిద్దడం, భూయజమానుల రికార్డులతో సరిపోల్చడం వంటి పనులు జరుగుతున్నాయి.  

మరిన్ని వార్తలు