ఏపీ: ఆపరేషన్‌ పరివర్తన్‌ రెండోదశ సక్సెస్‌ 

24 Dec, 2022 14:33 IST|Sakshi

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం 

గంజాయిని దహనం చేసిన పోలీసు శాఖ 

ఏలూరు రేంజ్‌లో రూ.15 కోట్ల విలువైన గంజాయి దహనం      

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం చేపట్టిన ఆపరేషన్‌ పరివర్తన్‌ రెండోదశను కూడా విజయవంతంగా నిర్వహించింది. మొత్తం 650 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా విశాఖ రేంజ్‌ డీఐజీ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఐదు జిల్లాలకు సంబంధించి దాదాపు 2 లక్షల కిలోల గంజాయిని పట్టుకున్నాము. దీనిలో 90 శాతం గంజాయి ఒరిస్సా నుండి వచ్చింది. పరేషన్ పరివర్తన ద్వారా గత ఏడాది 7500 ఎకరాల్లో గంజాయిని నిర్మిలించాము.

ఈ ఏడాది 650 ఎకరాల్లో ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి నిర్మిలించాము. గంజాయి ధ్వంసం చేసిన 7500 ఎకరాల్లో ఆల్టర్ నేట్ పంటలు వేసుకునేలా ప్రోత్సహించడం జరుగుతుంది. 3500 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తరలి రాకుండా 14 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. ఒరిస్సా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గంజాయి రవాణా అరికడుతున్నాము. ఆపరేషన్ పరివర్తన్ నిరంతర ప్రక్రియ. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గంజాయి తోటలను నాశనం చేస్తున్నాము. గతంలో కూడా 2 లక్షల ఎకరాల గంజాయిని ధ్వంసం చేశాము.

ఆపరేషన్‌ పరివర్తన్‌ రెండోదశ విజయవంతం..
ఒడిశా సరిహద్దుల్లోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో అక్కడక్కడ గుట్టుగా సాగుతున్న గంజాయి సాగును కూడా పూర్తిగా నిర్మూలించడానికి పోలీసు శాఖ ఆపరేషన్‌ పరివర్తన్‌ రెండోదశను తాజాగా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ నెలలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మారుమూల ప్రాంతాల్లో ఐదురోజులపాటు ఒడిశా అధికారుల సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసు శాఖ సమర్థంగా కట్టడి చేసింది. ఒడిశా అధికారులతో కలిసి ఏవోబీ పరిధిలో ఆరుమార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేసింది. ఇలా వివిధ మార్గాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 2,45,832 కిలోల గంజాయిని పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది. అందులో 70 శాతం గంజాయి ఒడిశా నుంచి మన రాష్ట్రం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నదే కావడం గమనార్హం. ఈ విధంగా ఆపరేషన్‌ పరివర్తన్‌ కింద ధ్వంసం చేసిన గంజాయి, దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసు శాఖ దహనం చేస్తోంది. ఏలూరు రేంజ్‌ పరిధిలో శుక్రవారం కాల్చేసింది.  

మరిన్ని వార్తలు