వైఎస్సార్‌ చేయూత రెండో దశలో రూ. 510.01 కోట్లు జమ 

13 Nov, 2020 08:05 IST|Sakshi

అర్హత ఉన్న మరో 2.72 లక్షల మంది మహిళలకు లబ్ధి

వారి ఖాతాలకు నగదు బదిలీ చేసిన మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స

తొలి దశలో 21,00,189 మందికి రూ.3,938 కోట్లు ఇచ్చిన సీఎం జగన్‌

కొత్తగా దరఖాస్తు చేసిన వారికి ఇప్పుడు చేయూత

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ చేయూత పథకంలో రెండో దశ కింద 2,72,005 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఖాతాలకు రూ. 510.01 కోట్ల నగదు జమ అయింది. గురువారం పంచాయతీరాజ్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదు బదిలీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాల్లోని బాధ్యతలు మీదపడ్డ పేద మహిళలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 12న ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పథకం ద్వారా 21,00,189 మంది మహిళల ఖాతాలకు రూ. 3,938 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. అర్హత ఉండీ ఎవ్వరైనా మిగిలినపోయిన వారు దరఖాస్తు చేసుకుంటే వారికీ సాయం అందిస్తామని ఆనాడు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స రెండో దశ నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు.  (ఎక్కడనుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చు)

మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకే..: మంత్రి పెద్దిరెడ్డి   
► మహిళలను ఆర్థికంగా సుస్థిరపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.  
► పేద కుటుంబంలో బాధ్యతలు మోసే మహిళలకు డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆర్థిక స్వావలంబన దిశగా వారిని నడిపించేందుకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్లు ఈ సహాయం అందజేస్తున్నాం.  
► ఈ కార్యక్రమంలో ప్రముఖ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేయడంతో ప్రతి కుటుంబానికి 15 నుంచి 18 శాతం అదనపు ఆదాయం వస్తుంది.  
► ప్రముఖ దిగ్గజ కంపెనీలతో కూడా ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  
► ముఖ్యమంత్రి ఇంత పెద్ద మొత్తంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సాయం చేయడాన్ని మనసారా స్వాగతిస్తున్నాను. 
ఈ కార్యక్రమంలో, పంచాయతీ రాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్‌ సీఈవో రాజబాబు, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  పథకం లబ్ధిదారులు తమ అనుభవాలు వివరించారు. 

ప్రొబేషన్‌ సమయంలో బదిలీలు ఉండవు 
ఉద్యోగుల ప్రొబేషన్‌ పీరియడ్‌లో ఎలాంటి బదిలీలు, డిప్యుటేషన్లకు అనుమతి ఇవ్వరాదని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సల ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కార్యాలయంలో ఉన్నతస్థాయి అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల ప్రొబేషన్‌ పీరియడ్‌ని సీరియస్‌గా తీసుకోవాలని, ఈ సమయంలో ఎలాంటి బదిలీలు, డిప్యూటేషన్లకు అనుమతి ఇవ్వరాదని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దీర్ఘకాలిక ప్రణాళికతో కార్యక్రమం: మంత్రి బొత్స 
► సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశానుసారం రెండో దశలో లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తున్నాం.  
► మా పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని నూటికి నూరుపాళ్లు నెరవేర్చడమే మా ప్రభుత్వ ద్యేయం.  
► లబ్ధిదారుల కుటుంబాలు డబ్బును సద్వినియోగం చేసుకునేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ కార్యక్రమం రూపొందించారు.
► దేశంలోని దిగ్గజ కంపెనీలతో మాట్లాడి మార్కెట్‌ ధరలకంటే తక్కువకు చేయూత లబ్ధిదారులకు సరుకులు ఇప్పించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది.  
► ఆయా వర్గాల మహిళలంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వారి కాళ్లపై వారు నిలబడేలా చర్యలు తీసుకుంటుంది.  
► కాల్‌సెంటర్‌కు కాల్‌చేసి కావాల్సిన సరుకులను ఈ మహిళలు షాప్‌కే తెప్పించుకునే వెసులుబాటు ఏర్పాటుచేశాం. అక్కచెల్లెమ్మలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి.

మరిన్ని వార్తలు