ఇది కథ కాదు.. దొరికిన వాళ్లే దొంగలు

15 Dec, 2020 08:54 IST|Sakshi

ఉద్యోగాల పేరుతో సచివాలయ ఉద్యోగి ఘరానా మోసం

సహకరించిన జిల్లా కేంద్రంలోని ఒక ఉద్యోగి, మరొకరు

ఆరుగురి నుంచి లంచంగా  రూ.12 లక్షలు వసూలు

జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓ, అధికారుల సంతకాలు ఫోర్జరీ

విషయం తెలిసినా ఉన్నతాధికారులకు చెప్పని ఎంపీడీఓ

సైలెంట్‌గా సెటిల్‌మెంట్‌ చేయిస్తున్న పోలీసు అధికారి

ఇదో అద్భుతమైన కథ. కాదు కాదు... వాస్తవం! ఈ కథలో దొరికినవారు దొంగలుగా... దొరకనివారు దొరలుగా కనిపిస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన కొన్ని వ్యవస్థలు తలచుకుంటే ఎంతటి తప్పునైనా చక్కగా కప్పిపుచ్చవచ్చని ఇక్కడ రుజువు చేస్తున్నారు. ఫిర్యాదు లేదు కదా... అంటూనే వారిని కాపాడటానికి ఓ అధికారి చెమటోడ్చారు.కళ్లముందు జరుగుతున్న అక్రమాన్ని ఆపలేకపోగా... కనీసం ఉన్నతాధికారులకు చెప్పేందుకు కూడా సాహసించని మరో అధికారి చక్కగా రక్తి కట్టించారు. రామభద్రపురం, విజయనగరం కార్యాలయాల వేదికగా సాగిన ఈ తతంగంపై విచారణ జరిగితే చాలామంది అధికారుల సీట్లు చిరిగిపోవడం ఖాయం. మరి అంతటి గొప్ప సాహసాన్ని ఎవరు చేస్తారో... 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగాల విప్లవాన్ని తీసుకువచ్చారు. కానీ సచివాలయాల్లో కొలువు సంపాదించిన కొందరు సీఎం ఆశయానికి తూట్లు పొడుస్తూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రామభద్రపురం సచివాలయంలో ఉన్నారు. బొబ్బిలిలో ఉంటున్న తన బంధువు, విజయనగరం జిల్లాకేంద్రంలో ఓ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కేవలం మెరిట్‌ ఆధారంగా మాత్రమే ఇవ్వాల్సిన ఉద్యోగాలను పైరవీల ద్వారా ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టా రు. అలా రామభద్రపురానికి చెందిన దాదాపు ఆరుగురు నిరుద్యోగుల నుంచి రూ.12లక్షలు వసూలు చేశారు. నిరుద్యోగులను,  డబ్బులను తీసుకుని కలెక్టరేట్‌ వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చాక ఫోన్‌ చేయగా లోపలి నుంచి ఒక ఉద్యోగి బయటకు వచ్చి వీరివద్ద ఉన్న డబ్బులు తీసుకుని పనైపోతుందని చెప్పి భరోసా ఇచ్చారు. అంతా సవ్యంగానే జరుగుతుందని వీరంతా భావించారు.  

ఫోర్జరీ సంతకాలతో పోస్టింగ్‌ ఆర్డర్స్‌ 
రూ.2 లక్షలు చొప్పున సమర్పించిన నిరుద్యోగులు తమకు నియామకపత్రాలు (అపాయింట్‌మెంట్‌ లెటర్లు) ఎప్పుడిస్తారని ఒత్తిడి తేవడంతో మరో ఎత్తుగడ వేశారు. తాత్కాలికంగా వారిని శాంతింపజేయడానికి నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు తయారు చేయాలని భావించారు. దానికి అవసరమైన సరంజామా అంతా సిద్ధం చేసి, కలెక్టర్, జిల్లా పరిషత్‌ సీఈఓ, ఇతర అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇంకేముంది కొన్ని అధికారిక ప త్రాలు రెడీ అయ్యాయి. వాటిని అభ్యర్థుల కు వాట్సప్‌ద్వారా పంపించేశారు. అక్కడే దొరికిపోయారు. అలా వెళ్లిన పత్రాలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పంచాయతీరాజ్‌ శాఖలో పోస్టులకు సంబంధించి డబ్బులు వసూళ్లవుతున్నాయ న్న ప్రచారం మొదలైంది. ఈ సంఘటన తో డబ్బులు ఇచ్చిన వారు మరింత ఒత్తిడి తెచ్చారు. పోలీసులను ఆశ్రయిస్తే డబ్బు లు తిరిగి ఇచ్చేది లేదని, ఉద్యోగాలు కూ డా రావని వారిని ఈ ముఠా బెదిరించింది. కాయకష్టం చేసి సంపాదించిన దానికి అప్పుచేసి తెచ్చిన డబ్బు జతచేసి ఇచ్చిన ఆ పేద నిరుద్యోగులు తమకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తే చాలనుకున్నారు. వారి బలహీనతను ఆసరా చేసుకుని పోలీసుల సాయంతో ఒక్కొక్కరికీ డబ్బులు సెటిల్‌ చేయడం ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులకు అక్కడి ఎంపీడీఓ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం విచిత్రం. 

జవాబులేని ప్రశ్నలెన్నో... 
ఈ వ్యవహారంలో సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు కొన్ని మిగిలిపోయాయి. అధికారిక పత్రాల్లో ఉన్న సంతకాలు ఫోర్జరీయేనా లేక నిజమైనవేనా? సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌ సంతకాన్నే ఫోర్జరీ చేసేస్తే ఇంతవరకూ ఎవరూ ఏమాత్రం పట్టించుకోకుండా ఎందుకున్నారు? జిల్లా మేజి్రస్టేట్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి పత్రాలు ఇవ్వడమేగాకుండా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన వారికి పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు? నేరం జరిగినట్లు సాక్ష్యాలతో సహా కనిపిస్తున్నా, బాధితుల ఫిర్యాదు లేదంటూ ఎందుకు తప్పించుకుంటున్నారు? తన పరిధిలో జరిగిన అక్రమాలను ముందే గుర్తించలేకపోయినప్పటికీ, తర్వాతైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకుండా తప్పుచేసిన వారిని ఎంపీడీఓ ఎందుకు కాపాడుతున్నారు? ఇంత మంది నోరునొక్కడం ఒక సచివాలయ ఉద్యోగికి సాధ్యమేనా? ఈ ఫోర్జరీ సంతకాలు ఇంకా ఎన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి., ఈ ప్రశ్నలకు సమాధాలు రావాల్సి ఉంది. 

నిజమే..కానీ చెప్పలేదు 
నిరుద్యోగుల నుంచి సచివాలయ ఉద్యోగి డబ్బు లు వసూలు చేయడం వాస్తవం. కొందరు విలేకరులు, స్థానికులు ఈ విషయం బయటకు పొక్కకుండా అతనిని కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. బాధితులు ఏడ్చుకుంటూ వచ్చి చెబుతున్నారే కానీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇమ్మన్నా ఇవ్వడం లేదు. మీ ఫోర్జరీ సంతకంతో అపాయింట్‌మెంట్‌ లెటర్‌ వచ్చింది చూడండని కలెక్టర్‌కు, సీఈఓకు నేను చెప్పగలనా, అలా చెబితే నన్ను ఉంచుతారా?. ఫిర్యాదు లేకుండా ఎలా చెప్పగలం.               
బి.ఉషారాణి, ఎంపీడీఓ, రామభద్రపురం 

ఫిర్యాదు ఇవ్వలేదు 
ఉద్యోగాల కోసం వసూళ్లు చేశారనే వార్తలు ఆధారాల్లేనివి. ఈ విషయంపై మా డీఎస్పీ ద్వారా ఎస్పీ గారు కూడా అడిగి రిపోర్టు ఇమ్మన్నారు. దీంతో డబ్బులు ఇచ్చిన వారిలో ముగ్గురిని పిలిపించి విచారించాం. తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని వారు చెప్పారు. అదే రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించాం. 
– ఎస్‌.కృష్ణమూర్తి, ఎస్‌ఐ, రామభద్రపురం   

మరిన్ని వార్తలు