సచివాలయ మహిళా పోలీస్‌ దేశానికే ఆదర్శం 

2 Mar, 2022 05:51 IST|Sakshi
గ్రామ సచివాలయాల్లో ప్రత్యక్ష స్పందన కార్యక్రమానికి హాజరైన ప్రజలు

సాక్షి, మచిలీపట్నం: గ్రామ సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరణ, తక్షణమే పరిష్కరించే కార్యక్రమం చేపడుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలను పలు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్‌ అధికారులు ప్రశంసించారు. గ్రామ సచివాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజలకు పోలీస్‌ సేవలు అందించడంపై శిక్షణ తరగతి (ట్రైనింగ్‌ సెషన్‌) నిర్వహించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మంగళవారం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌ శిక్షణ కార్యక్రమంపై నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో మిడ్‌ కెరీర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన 87 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ బ్రీఫింగ్‌ ఇచ్చారు.

గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తెలుసుకునేలా ఎస్పీ రూపొందించిన ‘ప్రత్యక్ష స్పందన’ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారు తిలకించారు. ఈ కార్యక్రమం ద్వారా వారి సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండకుండా, వారి గ్రామంలోనే మహిళా పోలీసుల ద్వారా సచివాలయాల నుంచి టైం స్లాట్‌ బుక్‌ చేసుకుని ఆ సమయంలో వచ్చి ఎస్పీతో వారి సమస్యలను చెప్పుకొనేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఎస్పీతో పాటు వారి ప్రాంత పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం ద్వారా పోలీస్‌ అధికారులతో వారి సమస్యను నేరుగా చెప్పుకొనే అవకాశం కల్పించారు.

ఎస్పీ ఫిర్యాదుదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ వారి ఎదురుగానే సంబంధిత పోలీస్‌ అధికారులకు ఆ ఫిర్యాదును బదిలీ చేసి, పూర్తి పారదర్శకంగా పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఫిర్యాదు పురోగతి గురించి బాధితులు మహిళా పోలీస్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి చూసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు.. సచివాలయ వ్యవస్థను, మహిళా పోలీసుల ఏర్పాటును, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని  ప్రశంసించారు. గ్రామ సచివాలయాల్లోనే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్న సచివాలయ మహిళా పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ వ్యవస్థ దేశానికే ఆదర్శమని చెప్పారు.  

మరిన్ని వార్తలు