Agneepath Protest: భద్రతా వలయంలో రైల్వేస్టేషన్లు

19 Jun, 2022 08:58 IST|Sakshi
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ పరిసరాలలో పహారా కాస్తున్న భద్రతా బలగాలు 

రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, కేంద్ర కార్యాలయాల వద్ద భారీగా బలగాలు మోహరింపు

గుంటూరు రైల్వేస్టేషన్‌ ముట్టడి భగ్నం

60 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

విశాఖ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దు

సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాటిచెట్టపాలెం(విశాఖ ఉత్తర)/కొత్తవలస రూరల్‌/ఆముదాలవలస: ‘అగ్నిపథ్‌’ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతా బలగాలు శనివారం పెద్దఎత్తున మోహరించాయి. రైల్వేస్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాలను, రైలు పట్టాలను ఆక్టోపస్, ఆర్ఫీఎఫ్, జీఆర్పీ, సివిల్‌ పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే రైల్వేస్టేషన్‌కు చేరుకునే మార్గాలను మూసివేశారు. శనివారం మధ్యాహ్నం వరకు రైల్వేస్టేషన్‌లోకి ఎవ్వరినీ అనుమతించలేదు. మధ్యాహ్నం నుంచి మాత్రం పలు రైళ్లు రాకపోకలు సాగించేందుకు రైల్వే వర్గాలు అనుమతించాయి.
చదవండి: ప్రైవేటు అకాడమీల ‘డేంజర్‌ గేమ్‌’! కీలక అంశాలు వెలుగులోకి

దీంతో హౌరా–యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, గోదావరి తదితర రైళ్లు విశాఖ నుంచి బయల్దేరాయి. చెన్నై మెయిల్, హౌరా మెయిల్, బొకారో, వాస్కోడగామా, టాటా–యశ్వంత్‌పూర్, గుంటూరు–రాయగడ, తిరుచ్చి–హౌరా తదితర రైళ్లు మాత్రం విశాఖకు రాకుండా దువ్వాడ మీదుగా రాకపోకలు సాగించాయి. అంతకుముందు విజయవాడ మీదుగా విశాఖ రావాల్సిన పలు రైళ్లను అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో నిలిపివేశారు.

గుంటూరు రైల్వేస్టేషన్‌ ముట్టడికి యత్నించిన ఆర్మీ అభ్యర్థులను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం 

అలాగే హౌరా వైపు నుంచి విశాఖ రావాల్సిన మరికొన్ని రైళ్లను పెందుర్తి, కొత్తవలస స్టేషన్‌లలో నిలిపివేశారు. మరోవైపు 19వ తేదీన షాలిమార్‌లో బయల్దేరాల్సిన షాలిమార్‌–హైదరాబాద్‌(18045), గుంటూరు–విశాఖ(17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, రాయగడ–విశాఖ(18527) ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు రద్దు చేశారు. శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేసేందుకు ప్రయతి్నంచగా.. డీఎస్పీ వాసుదేవరావు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు 
‘గుంటూరు రైల్వేస్టేషన్‌ ముట్టడి’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. గుంటూరులోని నెహ్రూనగర్‌ రైలు పట్టాల మీదుగా 20 మంది ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులు నడుచుకుంటూ రావడాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే గుంటూరు రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఇద్దరు యువకులను తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న ఫోన్‌లో ‘జస్టిస్‌ టూ ఆర్మీ’ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో ఆందోళనలకు సంబంధించిన సమాచారం చేరవేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కడప, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో మరో 40 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

ఆగిన ఊపిరి.. 
అగ్నిపథ్‌ ఆందోళనల వల్ల సమయానికి వైద్యమందక ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మరణించారు. ఒడిశాలోని కలహండి జిల్లా నౌహుపాడకు చెందిన జోగేష్‌ బెహరా(70)కు గుండె సంబంధిత సమస్యలున్నాయి. విశాఖలో వైద్యం చేయించుకునేందుకు కోర్బా–విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాడు. మరికొన్ని నిమిషాల్లో విశాఖ చేరుకుంటాడనగా.. అగ్నిపథ్‌ ఆందోళనల వల్ల రైలును శనివారం ఉదయం 10.45 గంటలకు విజయనగరం జిల్లా కొత్తవలసలో నిలిపివేశారు. ఆ తర్వాత కొంతసేపటికి జోగేష్‌ అస్వస్థతకు గురవ్వడంతో.. ఆయన్ని వెంటనే కొత్తవలస ఎస్‌ఐ హేమంత్‌ తన వాహనంలోనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మరిన్ని వార్తలు