తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ.. ఎన్నెన్ని ఆస్తులున్నాయో తెలుసా?

24 Jul, 2022 18:25 IST|Sakshi

2014కు ముందు రూ.114 కోట్లకు 173 ఆస్తుల విక్రయం 

దేశంలో 307 టీటీడీ కల్యాణ మండపాలు 

శ్రీవారి ఆస్తులకు జియో ట్యాగింగ్‌తో భద్రత 

ఆస్తులు విక్రయించకూడదని పాలకమండలి తీర్మానం 

తిరుమల: కలియుగంలో అత్యంత సంపన్నుడెవరంటే అందరూ తిరుమల శ్రీవారు అని వెంటనే చెప్పేస్తారు. వడ్డికాసులవాడైన ఆ శ్రీవేంకటేశ్వరస్వామికి ఉన్న ఆస్తులు.. ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి.. భక్తులు సమర్పించిన ఆస్తుల విలువ.. ఆ ఆస్తుల సంరక్షణ వ్యవస్థ.. తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

పదిటన్నుల బంగారం, రూ.8,500 కోట్ల నగదు బ్యాంకుల్లో.. 
బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలసంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. శ్రీవారికి భక్తులు తీర్చుకునే మొక్కులు అనేక విధాలుగా ఉంటాయి. హుండీలో నగదు సమర్పించేవారు కొందరైతే, బంగారం చెల్లించేవారు మరికొందరు. తమ బరువుకు సమానమైన పదార్థాలను తులాభారంగా చెల్లించేవారు ఇంకొందరు. స్వామి అలంకరణకు వినియోగించే ఆభరణాలు సమర్పించేవారు కొందరైతే.. ఇంకొందరు విలువైన భూములను శ్రీవారికి కానుకగా సమర్పిస్తారు. ఇక టీటీడీ నిర్వహించే ట్రస్ట్‌లకు ఏటా రూ.300 కోట్లకు పైగానే విరాళాలుగా అందిస్తున్నారు.

ఇలా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారం 10 టన్నులకు పైగా టీటీడీ బ్యాంకులో డిపాజిట్‌ చేసింది. వివిధ బ్యాంకుల్లో రూ.8,500 కోట్ల నగదును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది. స్వామి హుండీ ఆదాయం తరువాత టీటీడీకి ప్రధానమైన ఆదాయం బంగారం, నగదు డిపాజిట్ల మీద వచ్చేదే. మరోవైపు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భక్తులు ఆయా ప్రాంతాల్లో శ్రీవారికి ఎన్నో విలువైన భూములను కానుకగా సమర్పించారు. నేపాల్‌లోనూ భక్తులు సమర్పించిన ఆస్తులున్నాయి. 

7,636 ఎకరాల్లో ఆస్తులు 
టీటీడీ నిరర్ధక ఆస్తులు విక్రయించే అంశం గత ఏడాది వివాదాస్పదం కావడంతో.. ఇకపై టీటీడీ ఆస్తులు విక్రయించకూడదని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాలకమండలిలో పెట్టి తీర్మానం చేశారు. అప్పటినుంచి టీటీడీ ఆస్తులు ఎక్కడున్నాయి, వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు, వాటిద్వారా టీటీడీకి వచ్చే ఆదాయం ఎంత, అన్యాక్రాంతమైన భూములు, వాటిని స్వాధీనం చేసుకోవడం ఎలా, వాటిని టీటీడీ ఆదాయ వనరులుగా ఎలా ఉపయోగించుకోవాలి.. తదితర అంశాలను పరిశీలించడానికి టీటీడీ పాలకమండలి 4 టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది.

తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు టీటీడీకి దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు ఉన్నట్లు గుర్తించాయి. వీటిలో 2014కు పూర్వమే 173 ఆస్తులను రూ.114 కోట్ల రూపాయలకు టీటీడీ విక్రయించినట్లు గుర్తించారు. ప్రస్తుతం 75 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు 7,636 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములు 1,226 ఎకరాలు. వ్యవసాయేతర భూములు 6,410 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. 535 ఆస్తులు ప్రస్తుతం టీటీడీ వినియోగంలో ఉన్నాయి. 159 ఆస్తులను టీటీడీ ఇతరులకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.4.15 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది.

ఇక టీటీడీ వినియోగంలోలేని 169 ఆస్తులను ఇతరులకు లీజుకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. అన్యాక్రాంతమైన 29 ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తుల విలువ రూ.23 కోట్లుగా టాస్క్‌ఫోర్స్‌ గుర్తించింది. ఒక్క తిరుపతిలోనే ఐదు ప్రాంతాల్లో ఉన్న విలువైన టీటీడీ ఆస్తులను గుర్తించి వాటి అభివృద్ధిపై దృష్టి సారించారు. 12 ఆస్తులకు సంబంధించి ఎలాంటి వివరాలు, ఆధారాలు లేవు.

ఇటీవల తమిళనాడులోని తంజావురు జిల్లా కబిస్థలం అనే ప్రాంతంలో ఆరెకరాల టీటీడీ స్థలాన్ని కమిటీ గుర్తించింది. గతంలో వంద సంవత్సరాలకు ఈ స్థలాలను లీజుకు ఇవ్వడం, అప్పటికి టీటీడీ ఏర్పాటు కాకపోవడంతో వాటికి సంబంధించిన రికార్డులు లేవు. దీంతో వాటి గుర్తింపు టీటీడీకి ఇబ్బందికరంగా మారింది. మిగిలిన ఆస్తులకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి.  

కల్యాణ మండపాల ద్వారా ఆదాయం 
దేశవ్యాప్తంగా 307 ప్రాంతాల్లో టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించింది. ఇందులో 166 కల్యాణ మండపాల నిర్వహణ బాధ్యతను  ఇతరులకు అప్పగించింది. 29 కల్యాణ మండపాలను దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు లీజుకు ఇచ్చింది. వీటిద్వారా టీటీడీకి ఏటా రూ.4.28 కోట్ల ఆదాయం లభిస్తోంది.  

స్వామి ఆస్తులకు ఆధునిక భద్రత 
ప్రస్తుత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల గుర్తింపును సులభతరం చేయడానికి జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్‌ను టీటీడీ ప్రారంభించింది. తద్వారా ఆస్తులను సులభతంగా గుర్తించవచ్చని, అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చునని టీటీడీ భావిస్తోంది. 

సంపూర్ణమైన భద్రత 
స్వామివారి ఆస్తులను సులభంగా గుర్తించడానికి జియో ట్యాగింగ్‌ సిస్టం ఏర్పాటు చేశాం. జియో ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటు చేశాం. స్వామి పట్ల భక్తితో భక్తులు సమర్పించిన ఈ ఆస్తులను ఎప్పటికీ విక్రయించకూడదని పాలకమండలి కూడా తీర్మానించింది. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి స్వామి ఆస్తులను నాలుగు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాల ద్వారా గుర్తించి భద్రత కల్పించాం. 
– ధర్మారెడ్డి, టీటీడీ ఈవో   

మరిన్ని వార్తలు