రాష్ట్రంలోవిత్తన పరిశోధన, శిక్షణ సంస్థ 

24 Mar, 2023 05:13 IST|Sakshi

దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు  

గన్నవరం వద్ద 8 ఎకరాల్లో రూ.45 కోట్లతో నిర్మాణం 

రాష్ట్రంలో విత్తన పరీక్ష వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం 

రైతులతో పాటు విద్యార్థులకూ శిక్షణ.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కాకాణి  

సాక్షి, అమరావతి: దేశంలోనే తొలి విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల వ్యయంతో డాక్టర్‌ వైఎస్సార్‌ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ విత్తన పరిశోధన, శిక్షణా కేంద్రం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉంది.

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అనుబంధంగా రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి విత్తన జన్యు బ్యాంక్, సీడ్‌ గ్రో అవుట్‌ టెస్ట్‌ ఫామ్, సీడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్, గ్రీన్‌ హౌస్, సీడ్‌ ప్రాసెసింగ్, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, విత్తనాలు నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మించనుంది.

రైతుల కోసం ట్రైనింగ్‌ సెంటర్‌తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిపొ్లమా చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఈ రంగంలో పరిశోధనల వైపు అడుగు వేసే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్‌ సెంటర్, హాస్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 

సంస్థ లక్ష్యాలివే..
రాష్ట్రంలో విత్తన నాణ్యతను పరీక్షించే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, మానవ వనరుల అభివృద్ధి, సీడ్‌ సైన్స్, టెక్నాలజీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థలతో సమన్వయం చేసుకోవడం, ఏటా కనీసం 1,000 మంది అగ్రి గ్రాడ్యుయేట్స్, 2 వేల మంది అగ్రి డిపొ్లమా విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్‌ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి ఈ కేంద్రం సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కాగా, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు మాట్లాడుతూ.. ఏ వాతావరణాన్ని అయినా తట్టుకోగలిగేలా, అధిక దిగుబడులనిచ్చే కొత్త రకాల విత్తనాలను రూపొందించడంలో, సంకర జాతులను అభివృద్ధి చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.  

మరిన్ని వార్తలు