గుడి  తాళం తెరవక ముందే హడావుడి!

4 Jan, 2021 04:55 IST|Sakshi
ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న పోలీస్‌ అధికారులు

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆలయంలో పగిలిపోయిన సీతమ్మ మట్టి విగ్రహం 

ఉదయం 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచిన పూజారి

అంతకు ముందు నుంచే అక్కడ టీడీపీ నేత హడావుడి

టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచే మీడియాకు సమాచారం

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/కృష్ణలంక(విజయవాడ తూర్పు): టీడీపీ రాజకీయ కుట్రల్లో భాగంగానే ఆలయాల్లో విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని సీతారామ ఆలయం వద్ద టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పూజారి వచ్చి గుడి తలుపులు కూడా తెరవక ముందే ఆ ఆలయంలో సీతమ్మ మట్టి విగ్రహం ధ్వంసమైందంటూ టీడీపీ రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఓ నేత.. కొంత మంది ఆటో డ్రైవర్లను వెంటబెట్టుకుని వచ్చి అక్కడ హడావుడి చేశాడు. పూజారి రాకముందే.. అంటే ఉదయం 9.30 గంటలకు పూజారి రాజశేఖర్‌శర్మ తాళం తీయడానికి రాగా, అప్పటికి అరగంట ముందు నుంచే అక్కడ టీడీపీ నాయకులు గుమికూడి హడావుడి మొదలెట్టారు. టీడీపీ నేతల హడావుడి తర్వాతే ఆర్టీసీ అధికారులకు ఆ సమాచారం తెలిసింది. వెంటనే ఆర్టీసీ సిబ్బంది ఫోన్‌ ద్వారా ఆలయ పూజారికి సమాచారం ఇచ్చారు. అంతేగాకుండా విగ్రహం ధ్వంసమైందన్న సమాచారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకు చేరిందని, టీడీపీ శ్రేణులిచ్చిన సమాచారాన్ని ఓ టీవీ కెమేరామేన్‌ ఇతర మీడియా సభ్యులుండే గ్రూపులో పోస్టు చేసినట్టు తమ పరిశీలనలో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. దేవదాయ శాఖ పరిధిలో లేని ఆ చిన్న ఆలయానికి మూడు వైపులా పూర్తిగా మూసివేసి ఉంటుంది. ముందు వైపు చెక్క తలుపులు, ఇనుప గేట్‌ ఉంటుంది. పూజారి రోజుకోసారి నైవేద్యం పెట్టి వెళుతుంటారు. ఆలయ ప్రాంగణాన్ని ఊడ్చే మహిళ కూడా గత కొద్ది రోజులుగా రావడం లేదు. 

నేను వెళ్లేసరికే వారు అక్కడున్నారు: ఆలయ పూజారి
ఆర్టీసీ సిబ్బంది తనకు ఉదయం 9 గంటల సమయంలో ఫోన్‌ చేసి విషయం చెప్పగా, తాను 9.30 గంటల సమయంలో వచ్చి గుడి తాళం తెరిచినట్టు ఆలయ పూజారి రాజశేఖర్‌శర్మ చెప్పారు. అయితే అప్పటికే అక్కడ టీడీపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు, పోలీసులున్నట్టు తెలిపారు. టీడీపీ నేతలు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతోనే తాము అక్కడకు చేరుకున్నట్టు బీజేపీ కండువాలున్న గోసంరక్షణ సంఘం ప్రతినిధులు చెప్పారు. 

హడావుడి చేద్దామని వెళ్లి.. అభాసుపాలు 
కృష్ణా జిల్లా ఉయ్యూరు శివాలయంలో కేతువు విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఆదివారం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టీడీపీ కార్యకర్తలను పోగేసి ఆలయానికి వెళ్లారు. తీరా ఆ విగ్రహం చేతి భాగంలో రెండు నెలల కిందటే చిన్నపాటి పెచ్చులూడాయని పూజారి సత్యనారాయణశర్మ చెప్పడంతో టీడీపీ నేతల ఉత్సాహం నీరుగారిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి వాస్తవాలు ధ్రువీకరించడంతో ఎమ్మెల్సీ అక్కడ నుంచి జారుకున్నారు.

అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు 
విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న సీతారామాలయంలో ఆదివారం మట్టి విగ్రహం ఒరిగిపోవడంతో పగిలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ఉదయం 5.50 సమయంలో తాను దండం పెట్టుకునేందుకు వెళ్లినప్పుడు విగ్రహాలు బాగానే ఉన్నాయని దుర్గాపురం సుందరయ్య కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ మోహన్‌ కనకదుర్గావర ప్రసాద్‌ పోలీసులతో చెప్పారు. ఘటనపై డీసీపీ–2 విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ గుడి గేట్‌కు తాళం వేసి ఉందని, లోపలకు వెళ్లేందుకు అవకాశం లేదని, అయినా విగ్రహం ముందుకు పడిందని, ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. 

మరిన్ని వార్తలు