‘పరఖ్‌’లో నమోదు తప్పనిసరి

18 May, 2022 05:05 IST|Sakshi

ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశం

పరఖ్‌తో విద్యార్థుల నైపుణ్యాల స్వీయ అంచనా

పరిశ్రమలకు అవసరమైన మానవవనరులకు అవకాశం

ఇది స్వీయ అంచనాకే తప్ప పరీక్షకాదని ఏఐసీటీఈ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలన్నీ ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలోని ‘పరఖ్‌’ పోర్టల్‌లో నమోదు కావడం ఇక తప్పనిసరి. ఈమేరకు ఏఐసీటీఈ తాజాగా అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీచేసింది. అన్ని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు parakh.aicteindia.org పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పేర్కొంది.

విద్యావేత్తలు, సాంకేతిక, వృత్తిపరమైన నిపుణులు, పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో ఏఐసీటీఈ ‘పెర్ఫార్మన్స్‌ అసెస్మెంట్‌ రివ్యూ అండ్‌ అనాలసిస్‌ ఆఫ్‌ నాలెడ్జి ఫర్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌’ (పరఖ్‌) పేరిట ఈ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. విద్యార్థుల అభ్యాస మూల్యాంకనం దీని లక్ష్యం. విద్యార్థులు తమ అభ్యాస ఫలితాలను, నైపుణ్యాలను స్వీయ అంచనా చేసుకోవడానికి  ఇది ఉపకరిస్తుంది.

ఇది అసెస్‌మెంట్‌ పోర్టల్‌ అని, పరీక్షకాదని ఏఐసీటీఈ తాజాగా విడుదల చేసిన నోటీసులో స్పష్టం చేసింది. విద్యార్థులు తమ అధ్యయన సమయంలో వారి విద్యాపరమైన లేదా ఇతర అంశాలలో సాధించిన అభివృద్ధిని అంచనా వేయడానికి పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 7న కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఈ ఏకీకృత పోర్టల్‌ను ప్రారంభించారు.

అయితే సంస్థల నుంచి స్పందన ఆశించిన మేరకు లేకపోవడంతో నమోదును తప్పనిసరి చేస్తూ ఏఐసీటీఈ ఆదేశాలు జారీచేసింది. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విభాగాల్లోని విద్యార్థులకు వేర్వేరు అసెస్‌మెంట్‌లు కేటాయించారు. నిర్దేశిత గడువులోగా అసెస్‌మెంట్‌లు పూర్తయ్యేలా చూడాలని సంస్థలను ఏఐసీటీఈ ఆదేశించింది.  

మరిన్ని వార్తలు